ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్‌ కోతలతో సగానికి పడిపోయిన సామాన్యుడి ఆదాయం... పనివారికి తగ్గిన వేతనాలు - AP News

People suffering from power cuts: విద్యుత్‌ కోతలు పలు రంగాల్లో పనిచేసే వారి ఉపాధికి ‘కోత’ పెడుతున్నాయి. చిన్నచిన్న పరిశ్రమల్లో పనిచేసేవారికి రోజువారీ వేతనాలు సగానికి పడిపోయాయి. దీనికితోడు పెరిగిన ధరల వల్ల కుటుంబ పోషణ కూడా భారమైపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

People suffering from power cuts
People suffering from power cuts

By

Published : Apr 8, 2022, 5:20 AM IST

People suffering from power cuts: విద్యుత్‌ కోతలు పలు రంగాల్లో పనిచేసే వారి ఉపాధికి ‘కోత’ పెడుతున్నాయి. చిన్నచిన్న పరిశ్రమల్లో పనిచేసేవారికి రోజువారీ వేతనాలు సగానికి పడిపోయాయి. స్వయం ఉపాధి పథకాలు, చిన్న వర్తకాలు, దుకాణాల ఆధారంగా బతికేవారి ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా అన్ని రంగాలూ దెబ్బతిని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో విద్యుత్‌ కోతలు శరాఘాతంలా మారాయి. దీనికితోడు పెరిగిన ధరల వల్ల కుటుంబ పోషణ కూడా భారమైపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

సీజన్లో ఆదాయానికి గండి..:

‘‘ఇప్పుడు ఊరగాయ పచ్చళ్ల సీజన్‌. ఎండాకాలంలోనే ఆవకాయ, నిమ్మ వంటి నిల్వ పచ్చళ్లను ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటారు. దీనికి కారం, ఇతర దినుసులతో పాటు గానుగ నూనె ఎక్కువమంది వినియోగిస్తారు. మంచి సీజన్లో విద్యుత్‌ కోతల వల్ల ఆదాయం పోతోంది.’’ -దొబ్బల వెంకటేశ్వరరావు, గానుగ నిర్వాహకుడు, తిరువూరు

గ్రామాల్లో మీ సేవ కేంద్రాల ద్వారా ఇచ్చే వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ సుమారు 40 శాతం తగ్గిందని నిర్వాహకులు తెలిపారు. ఒకరోజులో పూర్తయ్యే పనిని రెండు, మూడు రోజులు చేయాల్సి వస్తోందని వడ్రంగి పనివారు.. పనులు పూర్తి కాక ఆదాయాలు పడిపోయాయని వెల్డింగ్‌ దుకాణదారులు పేర్కొన్నారు. ఉదయం నుంచి కష్టపడినా వేతనం సగానికి సగం పడిపోయిందని కొన్ని యూనిట్లలో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతకు కేంద్రమైన ధర్మవరం, పరిసర గ్రామాల్లో నేత పనివారు ఇబ్బంది పడుతున్నారు. 5 రోజుల్లో పట్టు చీర తయారు కావాల్సింది 8 రోజులు పడుతోంది. దీనివల్ల కూలీ కూడా గిట్టుబాటు కావటం లేదు. ఇలా పలు రంగాల్లో పనిచేసే వారి ఆదాయాలపై కరెంటు కోతల ప్రభావం పడింది.

ఆదాయం సగానికి సగమైంది..:

‘‘బంగారం కరగబెట్టడం, డిజైన్ల తయారీ, మెరుగుపెట్టడం అంతా యంత్రాల పైనే చేయాలి. రోజూ 5-6 గంటలు విద్యుత్‌ ఉండటం లేదు. ఇన్వర్టర్లు ఉన్నా ఆభరణాల తయారీకి ఉపయోగపడవు. జనరేటర్లు పెట్టే స్థోమత లేదు. బంగారం ధరలు పెరిగి అసలే ఆర్డర్లు లేక సతమతం అవుతుంటే.. విద్యుత్‌ కోతలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది.’’ -అప్పలనాయుడు, ఆభరణాల తయారీదారు, చిలకలూరిపేట

ఉత్పత్తి సగానికి తగ్గింది..:

‘‘జీన్స్‌ ప్యాంట్ల తయారీ ఇక్కడ కుటీర పరిశ్రమగా ఉంది. వందలాది పరిశ్రమల్లో సుమారు 9 వేల మంది ఉపాధి పొందుతున్నారు. రోజూ సుమారు లక్ష ప్యాంట్లు తయారవుతాయి. దీంతో పాటు గుండీలు, ఇస్త్రీ తదితర అనుబంధ రంగాలపై ఆధారపడి సుమారు 15 వేలమంది ఉపాధి పొందుతున్నారు. విద్యుత్‌ కోతల కారణంగా ఉత్పత్తి సగం పడిపోయింది. కొవిడ్‌ కారణంగా అప్పట్లో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ప్యాంట్ల తయారీకి అవసరమైన వస్త్రం ధరలు సుమారు 60 శాతం పెరిగి పరిశ్రమను నిర్వహించడమే కష్టంగా ఉంది. ఈ సమయంలో విద్యుత్‌ కోతలతో పూర్తి స్థాయి ఉత్పత్తి లేక ఆదాయాలు తగ్గాయి’’ -టంకశాల హనుమంతు, గార్మెంట్స్‌ పారిశ్రామికవేత్త, రాయదుర్గం

వర్కర్లకు కూలీ ఇవ్వటం కూడా కష్టమే..:

‘‘ఉడ్‌ కటింగ్‌, పాలిషింగ్‌, చిత్రిక వంటి పనులన్నీ యంత్రాల పైనే నిర్వహిస్తాం. కొద్దిరోజులుగా విద్యుత్‌ కోతలతో ఇబ్బంది పడుతున్నాం. ఒకరోజులో పూర్తి కావాల్సిన పనికి రెండుమూడు రోజులు పడుతోంది. సాయంగా ముగ్గురు వర్కర్లను పనిలో పెట్టుకున్నా. రోజుకు ఒక్కొక్కరికి రూ.800 వేతనం ఇవ్వాలి. వారు ఇక్కడ పనిచేసేది 8 గంటలు. విద్యుత్‌ కోతల వల్ల 5-6 గంటలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. ఇలాగైతే వర్కర్లకు కూలీ ఇవ్వటం కూడా కష్టమే’’ -అమర్‌బాబు, గుడివాడ

ఇదీ చదవండి:CBN On Power Cuts: రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది - చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details