fastag balance check : సంక్రాంతి పండుగకు లక్షలమంది సొంతూళ్లకు తరలి వెళ్తుంటారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల జాతరే. సొంత వాహనాల్లో వెళ్లేవారి ప్రయాణం టోల్‌ప్లాజాల వద్ద జాప్యం లేకుండా సాఫీగా సాగాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి. చాలామంది వాహనదారులు ఫాస్టాగ్ యాప్‌లో నగదు చూసుకోవడం లేదు. టోల్‌ప్లాజాకు వచ్చాక బ్యారియర్ పైకి లేవకపోవడంతో ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులో పడిందని తెలుసుకొని వెనక్కి వెళ్లి రెండింతల అదనంగా టోల్ రుసుమును చెల్లిస్తుంటారు. మరికొందరు టోల్‌ప్లాజా దగ్గరికి వచ్చాక రీఛార్జీ చేస్తున్నారు.
యాక్టివేషన్ కావడానికి 15 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. నెట్‌వర్క్ సమస్య ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది. పండగ రద్దీ వేళ ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుంది. నగదు అయిపోయిన వెంటనే రీఛార్జీ చేసుకుంటే సమస్య ఉండదు. అందుకే ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే ఫాస్టాగ్‌లో నగదు చూసుకుంటే మంచిదని టోల్‌ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. 2020 ఫిబ్రవరిలోనే ఫాస్టాగ్ మినిమం బ్యాలెన్స్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ఎత్తివేసింది. కానీ.. నేటికి కొన్ని బ్యాంకులు రూ.100 నుంచి రూ.200 బ్యాలెన్స్ నిబంధన అమలు చేస్తున్నాయి.