ఇంటి కప్పుపై సౌర విద్యుత్ ఫలకల ఏర్పాటు పథకాన్ని ప్రజలకు అందకుండా డిస్కంలు వ్యవహరిస్తున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజలు కేంద్రం ఇచ్చే రాయితీల్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో పునరుత్పాక దక ఇంధన వనరుల శాఖ(నెడ్ క్యాప్) నోడల్ ఏజెన్సీగా పథకాన్ని అమలు చేసింది. లబ్ధిదారులను నెట్ క్యాప్ ఎంపిక చేస్తే.. నెట్ మీటర్లను డిస్కంలు అమర్చాలి. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం పథకం అమలుకు ఇబ్బందిగా మారిందన్నది కేంద్రం ఆలోచన. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం బాధ్యతను డిస్కంలకు కట్టబెట్టింది కేంద్రం. అయితే వాణిజ్య కనెక్షన్ల వినియోగదారులు ఎక్కువగా సౌర పథకానికి ఆకర్షితులైతే నష్టపోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో డిస్కంలు ఇంటి కప్పుపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
స్పందన కరవు..
నెడ్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా ఏటా సుమారు 60-70 మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. పథకం అమలును డిస్కంల పరిధిలోకి తెచ్చాక పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో మూడు డిస్కంలలో ఒక్క తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) మాత్రమే 8 మెగావాట్ల ప్రాజెక్టులను చేపట్టింది. ఇటీవల టెండర్లను పూర్తి చేసి 17 సంస్థలతో ఎమ్ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఈపీడీసీఎల్ లబ్ధిదారులకే కేంద్రం ఇచ్చే రాయితీలు అందనున్నాయి. దీని వల్ల దక్షిణ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థల జిల్లాలలోని ప్రజలు ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నా..రాయితీ వచ్చే అవకాశం లేదు. నెడ్ క్యాప్ లెక్కల ప్రకారం ఏటా కనీసం 70 మెగావాట్ల ప్రాజెక్టులుగా లెక్కలోకి తీసుకుంటే డిస్కంల నిర్లక్ష్యం కారణంగా రూ.100 కోట్లను ప్రజలు నష్టపోవాల్సి వస్తుంది.
ఇదీ చదవండి:Nadu-Nedu:'నాడు-నేడు' బడులను.. ప్రజలకు అంకితం చేయనున్న జగన్