ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనతా కర్ఫ్యూ చేశారు.. లాక్​డౌన్​ మరిచారు - curfew situatuion in ap

జనంలో భారీగా కనిపించిన జనతా కర్ఫ్యూ స్ఫూర్తి... లాక్‌డౌన్‌లో కరువైంది. ఆదివారం ఇంటి నుంచి కదలని పౌరులు కర్ఫ్యూ పూర్తైన అనంతరం రోడ్లపై కనిపించారు. సామాజిక దూరం పాటింపును పూర్తిగా పక్కన పెట్టేశారు. అత్యవసరాలో.. మరేదోగానీ రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ రద్దీ కనిపించింది. పోలీసులు జోక్యం చేసుకుని జనాన్ని నియంత్రించాక మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త మెరుగుపడింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను నియంత్రించారు.

జనతా కర్ఫ్యూ చేశారు.. లాక్​డౌన్​ మరిచారు
జనతా కర్ఫ్యూ చేశారు.. లాక్​డౌన్​ మరిచారు

By

Published : Mar 24, 2020, 9:41 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నెల 31వ తేదీ వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ... చాలా ప్రాంతాల్లో జనం ఆంక్షలేవీ పట్టించుకోలేదు. సామాజిక దూరాన్నీ పాటించలేదు. చాలామంది అవగాహన లేమితో సమస్య మరింత పెరిగింది. రైతుబజార్లు, దుకాణాల్లో కూరగాయలు, నిత్యావసరాల కోసం ఒకరిపై మరొకరు ఎగబడ్డారు. ఆటోలు, ట్యాక్సీల రాకపోకలపై ఆంక్షలు విధించినప్పటికీ... ఎవరూ పట్టించుకోలేదు. చాలాచోట్ల ప్రైవేటు వాహనాలు ఇష్టానుసారంగా తిరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లనూ తెరిచారు. అయితే పోలీసులు, అధికార యంత్రాంగం రంగంలోకి దిగటంతో మధ్యాహ్నానికి పరిస్థితి కొంత మెరుగుపడింది. ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో కొంతవరకూ జన సంచారం తగ్గింది. అంగన్‌వాడీ కేంద్రాలు తెరుచుకున్నప్పటికీ పిల్లలెవరూ హాజరుకాలేదు.

సరిహద్దుల్లో నిలిచిన రవాణా...

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కృష్ణా జిల్లా కంచికచర్ల, జగ్గయ్యపేట, నూజివీడు వద్ద ఏపీ - తెలంగాణ మధ్య సరిహద్దుల్ని మూసేశారు. ఫలితంగా.. వాహనాలు బారులు తీరాయి. బెంగళూరు - అనంతపురం జాతీయ రహదారిపై కొడికొండ వద్ద ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక సరిహద్దు మూసేశారు. మడకశిర, రాయదుర్గం, కల్యాణదుర్గం, గుంతకల్లు, హిందూపురం మీదుగా కర్ణాటక వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనేక రహదారులు, మార్గాలున్నాయి. వాటన్నింటివద్ద రాకపోకల్ని నియంత్రించారు. అత్యవసర వాహనాలు, నిత్యావసర సరుకులు సరఫరా చేసే వాహనాలను తప్ప మిగతా వాటిని పంపించలేదు.

ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన పాతపట్నం, బత్తిలి, ఇచ్ఛాపురంల్లో సరిహద్దుల్ని మూసేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్ర - తమిళనాడు సరిహద్దును నెల్లూరు జిల్లా తడవద్ద మూసేశారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలోని 4 సరిహద్దు ప్రదేశాల్లో తెలంగాణ నుంచి ఎలాంటి వాహనాలూ జిల్లాలోకి అడుగుపెట్టకుండా పోలీసులు పహారా కాశారు. గరికపాడువద్ద తొలుత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌వైపు వస్తున్న వాహనాలను అనుమతించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణవైపు ఉదయం 11 గంటల వరకు వెళ్లనిచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర నుంచి వస్తున్న వాహనాలను ముందుకు వెళ్లకుండా తెలంగాణ పోలీసులు నిలిపేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. పరిస్థితిని గమనించిన ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దు దాటుతున్న వాహనాలను వెనక్కి మళ్లించారు. ఆరోగ్య సమస్యలతో వెళ్తున్న వారివద్ద పత్రాలను పరిశీలించి వెళ్లడానికి అనుమతించారు.

పలువురు ఇతర వాహనదారులు అనుమతివ్వాలని కోరగా నందిగామ డీఎస్పీ రమణమూర్తి వారిని వారించి వెనక్కి పంపారు. ఈనెల 31వ తేదీ వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని డీఎస్పీ సూచించారు. మరోవైపు జగ్గయ్యపేట మండలం బలుసుపాడు, బూదవాడ, ముక్త్యాల, మల్కాపురం, గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అనుమతులివ్వడం వల్ల ఇరు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలు సాగాయి. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సోమవారం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించారు. చిత్తూరు జిల్లా సరిహద్దులను పోలీసుశాఖ మూసివేసింది.

కృత్రిమ కొరత.. అధిక ధరలు

లాక్‌డౌన్‌ నెపంతో పలువురు నిత్యావసర వస్తువులు, కూరగాయలకు కృత్రిమ కొరత సృష్టించి.. అధిక ధరలకు విక్రయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాల్లో కిలో ఉల్లి ధరను రూ.25 నుంచి రూ.40కు పెంచారు. వివిధ రకాల కూరగాయలపై కిలోకు రూ.10 వరకూ ధర పెంచి అమ్మారు. గుంటూరు జిల్లాలో పప్పులపై కిలో రూ.5 వరకూ పెంచారు. టమాటా కిలో రూ.20 నుంచి రూ.30కు ఎగబాకింది. విజయవాడలో బీరకాయ కిలో రూ.80, బంగళాదుంపలు రూ.60, ఉల్లిపాయలు రూ.40, టమాటా రూ.40, మునక్కాయలు ఒక్కొటీ రూ.18కి పెంచి విక్రయించారు. నెల్లూరు జిల్లాలో టమాటాలు కిలో రూ.50, క్యారెట్‌ను కిలో రూ.80 వరకూ పలికాయి. పప్పులపై కిలోకు రూ.20 వరకూ ధరలు పెంచి విక్రయించారు. విశాఖపట్నం జిల్లాలో మొన్నటి వరకు కిలో రూ.20 నుంచి రూ.25 ఉండే టమాటాను సోమవారం రూ.50పైగా అమ్మారు. అరటికాయలు, ఇతర కూరగాయల ధరలూ పెంచేశారు.

కిక్కిరిసిన వాహనాలు..

ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ.. ప్రైవేటు వాహనాలు తిరిగాయి. ఆటోలు, పలు ప్రైవేటు ట్యాక్సీలు కిక్కిరిసేలా ప్రయాణికుల్ని ఎక్కించుకుని రాకపోకలు సాగించాయి. పలువురు ద్విచక్ర వాహనాలపై యథేచ్చగా రోడ్లపై తిరిగారు. వీటిల్లోనూ ఛార్జీలు అమాంతం పెరిగాయి.

తెరుచుకున్న వాణిజ్య సముదాయాలు

ఏలూరు, భీమవరం, తణుకు, ప్రాంతాల్లో వస్త్ర దుకాణాలు, మాల్స్‌ తెరిచారు. గుంటూరులోనూ వర్తక, వాణిజ్య కేంద్రాలను తెరిచారు. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. వీటివద్ద ప్రజలు గుమిగూడారు. దీంతో పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది, కార్మికశాఖ అధికారులు జోక్యం చేసుకుని వాటిని మూసివేయించారు. రాజమహేంద్రవరంలో బార్లు, మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తిరుపతిలో మద్యం దుకాణాలు మూతపడినప్పటికీ రహస్యంగా విక్రయాలు సాగించారు. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మధ్యాహ్నానికంతా వీటిని మూసివేయించారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్​పై సీఎం సమీక్ష.. పటిష్ట అమలుకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details