YCP Gadapa Gadapaku: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా.. వైకాపా నేతలు మంగళవారం వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించారు. నేతలపై వీధివీధినా ప్రశ్నల వర్షం కురిపించారు జనాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో గడపగడపకు వెళ్లిన మంత్రి ఉషశ్రీ చరణ్‌కు సమస్యలు స్వాగతం పలికాయి. మంచినీటి సమస్య తీర్చాలని పాతచెరువు ప్రజలు కోరారు. గోళ్ల గ్రామ మహిళలు వివిధ సమస్యలు ప్రస్తావించారు. తన కుమారుడు స్థానిక వైకాపా నాయకుడు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నా.. ప్రభుత్వం ఇల్లు కూడా ఇవ్వలేదని ఓ పెద్దావిడ వాపోయింది.
గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఓ ఇంటికి వెళ్లిన ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. జగన్ పాలన బాగోలేదంటూ మొహానే చెప్పేశాడు. లింగపాలెం మండలం వేములపల్లిలో ఎలీజా పర్యటించారు. చంద్రరావు అనే గ్రామస్థుడితో ముచ్చటించారు. డబ్బులు పడుతున్నాయి కదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. ఊళ్లో సమస్యలన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయని చంద్రరావు బదులిచ్చారు. సొంత పార్టీ నేతలకే పింఛన్ ఇవ్వకపోతే ఎలా పనిచేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైకాపా కార్యకర్త నిలదీశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు... ప్రజలు తమ సమస్యలు నివేదించారు. దివ్యాంగుడైన తన కుమారుడికి ఏడాది నుంచి పింఛను ఆపేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మరో ఇంట్లో ఏ ఆధారం లేని వితంతువు, కళ్లు లేని వృద్ధురాలికి పింఛను రావడం లేదని ఎమ్మెల్యేకి తెలియజేశారు. గతంలో ఉన్న రేషన్ కార్డు కూడా తొలగించారని వాపోయారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో గడపగడపకు నిర్వహించిన మేకపాటి విక్రమ్‌రెడ్డిని ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఓ వ్యక్తి నిలదీశారు. ఏవో కారణాలు చెబుతూ తమకు ఇల్లు మంజూరు చేయలేదన్నారు. అధికారుల సొంత రూల్స్ పెట్టడం సరికాదన్నారు.