CM Jagan Nandyala programme : రైతుభరోసా రెండో విడత నిధులు నేడు విడుదల కానున్నాయి. ఆళ్లగడ్డలో నిర్వహించే కార్యక్రమంలో.. సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా మూడు రోజుల ముందు నుంచే ఆళ్లగడ్డలో బారికేడ్లు ఏర్పాటుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ నేడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పర్యటించనున్నారు. ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో "రైతుభరోసా - పీఎం కిసాన్" నిధులను సీఎం విడుదల చేయనున్నారు. పంట కోతకు, రబీ అవసరాల కోసం ఒక్కో లబ్ధిదారుడికి 4వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2 వేల96.04 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమం కోసం ఉదయం 9 గంటలకు గన్నవరం విమాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం.. 10 గంటల 15 నిమిషాలకు ఆళ్ళగడ్డ చేరుకుంటారు. 10 గంటల 45 నిమిషాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బటన్ నొక్కి రైతుభరోసా నిధులు విడుదల చేస్తారు.