కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద మే 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న సామాజిక భద్రత పింఛన్లకు బయోమెట్రిక్ విధానం కొనసాగింపుపై క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పింఛను సాయాన్ని ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తోంది. దాదాపు 3.50 లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. వైరస్ బాధితులు వాడిన బయోమెట్రిక్ యంత్రాన్ని తర్వాత వేరేవారు వాడితే.. వారికి వైరస్ సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ విధానంపై భయం నెలకొంది. పింఛను లబ్ధి పొందేవారిలో అత్యధికంగా 27.55 లక్షల మంది వృద్ధులే ఉన్నారు. డయాలసిస్ చేయించుకునేవారు, హెచ్‌ఐవీ బాధితులు, థలసేమియా, పక్షవాతం, మానసిక వైకల్యంతో బాధపడేవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హోం ఐసొలేషన్‌లో వేల మంది
రాష్ట్రంలో రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో చాలామంది హోం ఐసొలేషన్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కొందరు తమకు కరోనా సోకినా ఎవరికీ చెప్పకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. వీరి సమాచారం వాలంటీర్లకూ తెలియదు. చాలా కేసులకు ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ విధానంలో పింఛన్లు ఇవ్వడమంటే.. ముప్పు ముంగిట నిల్చోవడమే. పింఛను పంపిణీ సమయంలో బయోమెట్రిక్ పరికరంపై లబ్ధిదారుల వేలిముద్ర తీసుకుంటారు. వృద్ధుల్లో కొందరికి నాలుగైదు సార్లు వేసినా వేలిముద్రలు పడవు. ఇలా పడనివారికి ఐరిస్‌తోను, అదీ పడకపోతే లబ్ధిదారుల కుటుంబసభ్యుల బయోమెట్రిక్‌ను తీసుకుంటారు. వేలిముద్రలు సరిగా నమోదుకాని సమయంలో లబ్ధిదారుల వద్ద ఎక్కువసేపు ఉండాలి. కరోనా వ్యాప్తి సమయంలో ఇది ప్రమాదకరమే. గతేడాది కరోనా సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దుచేసి లబ్ధిదారుల ఫొటో తీసి పింఛను పంపిణీచేసే విధానాన్ని అమలుచేశారు. ఈసారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. బయోమెట్రిక్ విధానం లేకుండా ఫొటో విధానంలో పంపిణీకి వీలు కల్పించాలని వారు కోరుతున్నారు.
పింఛన్ల పంపిణీకి బయోమెట్రిక్ దడ - ఏపీలో పెన్షన్లు న్యూస్
పింఛన్ల పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని కొనసాగించటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో.. బయోమెట్రిక్ యంత్రాన్ని వాడటంపై పెన్షన్‌దార్లు టెన్షన్ అవుతున్నారు.
పింఛన్ల పంపిణీకి బయోమెట్రిక్ దడ
ఇదీ చదవండి: