State Audit: రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పింఛను మంజూరు అధికారాన్ని రాష్ట్ర ఆడిట్ కార్యాలయం పరిధిలోకి తీసుకురానున్నారు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం (ఏజీ) నుంచి తొలగించి, రాష్ట్ర ఆడిట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ ఉద్యోగులు పదవీవిరమణ ప్రయోజనాల ప్రతిపాదనలను ఏజీ కార్యాలయానికి సమర్పిస్తున్నారు. అక్కడి నుంచి పింఛను, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ నిర్ణయించి, బిల్లులను ట్రెజరీకి పంపిస్తున్నారు. ఇకనుంచి రాష్ట్ర ఆడిట్ విభాగమే పింఛను, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ నిర్ణయిస్తుంది. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పింఛన్ల మంజూరును ఆడిట్ విభాగం చేయనుంది. ఆన్‌లైన్‌లో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఆడిట్ కార్యాలయంలో సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
"పింఛనుదారులు ఇప్పట్లాగే ఆరు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు పంపాలి. పూర్తిస్థాయిలో పింఛనును ఆన్‌లైన్‌లోనే మంజూరు చేస్తాం. సీఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్‌లో నమోదుచేయాలి. డేటా నింపాక బయోమెట్రిక్ వేయాలి. పింఛను ఆన్‌లైన్ చేశాక ప్రతినెలా సంక్షిప్త సందేశాలు వస్తాయి.ప్రస్తుతం ఉన్న 13పేజీల పింఛను ప్రతిపాదనలను నాలుగు పేజీలకు సరళీకృతం చేశాం. ఈ-ఎస్ నవీకరించుకుంటే ఈ విధానం సులభతరమవుతుంది"-హరిప్రకాష్, రాష్ట్ర ఆడిట్ విభాగం డైరెక్టర్