ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన మన బడి ‘నాడు-నేడు’ మొదటి దశ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనుల పెండింగ్ వల్ల కొన్నిచోట్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదుల మరమ్మతు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, రంగుల పనులు కొనసాగుతుండడంతో పిల్లలు ఆరుబయట కూర్చొని పాఠాలు వింటున్నారు. తరగతి గదులు, ఆవరణల్లో నిర్మాణ సామగ్రి వేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ విద్యార్థులను కూర్చోబెట్టడం సమస్యగా మారుతోంది. విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడంతో గదుల కొరత ఏర్పడుతోంది.
నాడు-నేడులో పాఠశాలల అన్ని పనులను ఫిబ్రవరికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కానీ.. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు అన్ని పనులు పూర్తయింది కేవలం 39.67శాతమే. పాఠశాలలకు రంగులు వేసేందుకు మార్చి వరకు సమయం ఉండగా, ఇప్పటికీ 2.24% బడులకే రంగులు వేశారు. తాగునీటి ట్యాంకులు, విద్యార్థులు, సిబ్బంది కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్‌లు, గ్రీన్ చాక్‌బోర్డుల కొనుగోలుకు కేంద్రీయ టెండర్లు నిర్వహించారు. గుత్తేదారులు వీటి సరఫరాలో జాప్యం చేస్తున్నారు.