Pegasus spyware issue in assembly: పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. శాసనసభలో దుమారం రేపింది. సోమవారం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వేదికగా సీఎం మమతా బెనర్జీ చెప్పారని, దీనిపై సమగ్ర చర్చ అవసరమని పేర్కొన్నారు. దీనిపై తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం చెబుతూ నినాదాలు చేశారు. ‘పెగాసస్‌తోపాటు 2014 నుంచి 2019 మధ్య చోటు చేసుకున్న వివిధ అక్రమాలపైనా విచారణ చేయాలి. సభా సంఘం వేయాలి. తప్పు చేసిన వారిని శిక్షించేలా చర్యలు తీసుకోవాలి’ అని బుగ్గన కోరారు. పలువురు వైకాపా సభ్యులూ ఇదే డిమాండు చేయడంతో విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఒకటి, రెండు రోజుల్లో కమిటీలో సభ్యుల పేర్లు వెల్లడిస్తామని తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెగాసస్‌పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ మొదలైంది. అప్పటికే తెదేపా సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడంతో ఈ అంశంపై వైకాపా ఎమ్మెల్యేలే మాట్లాడారు. మమతా బెనర్జీ చెప్పినట్లు.. చంద్రబాబు ఈ సాఫ్ట్‌వేర్ కొని ఉంటే అది ఘోరాతిఘోరమైన విషయమని మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడారంటూ వివిధ ఆంగ్ల దిన పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగులను ఆయన చదివి వినిపించారు. పెగాసన్ కొన్నారనడానికి రుజువేమీ లేదని, ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులను చట్ట వ్యతిరేకంగానే చేస్తారని, అంత సులభంగా ఆధారాలు దొరకనివ్వరని విమర్శించారు. 2017, ఆ తర్వాత చోటుచేసుకున్న పలు వ్యవహారాలు దీనికి ఊతమిచ్చేలా ఉన్నాయని ఆరోపించారు.
ప్రతిపక్షాలు, ప్రజలపైనా నిఘా పెట్టారు...
పెగాసస్ స్పైవేర్‌తోపాటు వివిధ రకాలుగా నిఘా పెట్టారని మంత్రి బుగ్గన విమర్శించారు. రూ.25 కోట్లతో డ్రోన్ల సరఫరాకు 2017 జూన్‌లో ప్రతిపాదనలు రూపొందించారని, తర్వాత జులైలో అప్పటి ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేశారని విమర్శించారు. ‘డ్రోన్ల సరఫరాకు 4 సంస్థలు ముందుకొచ్చాయి. సాంకేతిక పరిశీలన సందర్భంగా ఇందులో మూడు వెనక్కి వెళ్లగా.. ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థ మాత్రమే ఎంపికైంది. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు సీఈవోగా ఉన్న ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ దీనికి భారత్‌లో డీలర్. అయితే తర్వాత వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారుల బృందం ఏదో కారణంతో.. దీనిపై చర్చించి టెండర్లను రద్దు చేసింది. ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు 2017లో రెండుసార్లు ఇజ్రాయెల్ వెళ్లి వచ్చారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు) తన ఫోన్‌తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని రిట్ దాఖలు చేశారు. ఐటీగ్రిడ్ ఆధ్వర్యంలో సేవామిత్ర యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లపై నిఘా పెట్టి.. వారు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారనేందుకూ ఆధారాలున్నాయి’ అని బుగ్గన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాసమాచారం కూడా దొంగిలించారని స్పష్టమవుతోందని, దీనిపై సభా కమిటీ వేయాలని ఛీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు పెగాసస్‌పై చర్చను వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రారంభించి మాట్లాడారు. పెగాసస్ కొనుగోలు వ్యవహారంపై ప్రతిపక్షనేత చంద్రబాబు శాసనసభకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. ‘చంద్రబాబు, ఆమె (మమత) రాజకీయ మిత్రులే. వాస్తవం కాకపోతే ఆమె ఆ విషయం ఎందుకు చెబుతారు’ అని వ్యాఖ్యానించారు. అయిదు కోట్ల ప్రజల హక్కులకు సంబంధించిన పెగాసస్‌పై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే పెగాసస్ వ్యవహారంపై విచారణ చేయించి శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీకి నివేదిక పంపాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కోరారు.
ఇదీ చదవండి:Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం: నారా లోకేశ్