Peanut cultivation: తెలంగాణలోని నల్గొండ జిల్లా నల్లమలను ఆనుకుని ఉన్న దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, మల్లేపల్లి, పీఏపల్లి మండలాల్లోని ప్రాంతాలను కృష్ణపట్టిగా పిలుస్తుంటారు. పక్కనే కృష్ణమ్మ ప్రవాహం.. కూతవేటు దూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా.. క్షామంతో కమ్ముకున్న ఈ ప్రాంతాలు కన్నీటి సంద్రంలో కొట్టుమిట్టాడుతుండేవి. పీడిస్తున్న కరవుతో పొట్టచేతబట్టుకుని ఉపాధి కోసం వలసలు వెళ్తుండేవారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి మారింది. కరవుతో అల్లాడిన ఊళ్లు.. పచ్చదనంతో వికసిస్తున్నాయి. బీడువారిన నేలల్లో.. కాసుల పంట పండుతుండుతోంది. దీంతో.. రైతులు పులకరించిపోతున్నారు.
సంప్రదాయ పంటలకు బదులుగా..
కృష్ణపట్టిలో కరవుతో వలస వెళ్లిన వారంతా రెండేళ్ల క్రితం లాక్‌డౌన్‌తో ఊళ్లబాట పట్టారు. కరోనా పరిస్థితులు, తమ ప్రాంతంలో పెరిగిన భూగర్భజలాలతో వ్యవసాయంపై పుట్టిన ఆశలతో హలం పట్టి పొలం దున్నటం ప్రారంభించారు. ఈ సారి వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకు బదులుగా వేరుశెనగ పంటపై దృష్టి సారించారు. ఎగువన ఉన్న డిండితో పాటూ తలాపునే ఉన్న సాగర్ ప్రాజెక్టు నిండుకుండలను తలపిస్తుండటంతో... భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతులు బోరు బావులు తవ్వి.. నీటిని వృథా చేయకుండా స్ప్రింకర్లను బిగించి వాటి ద్వారా వేరుశనగ సాగు చేస్తున్నారు.