ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అధికారిక గీతంగా 'జయజయహే తెలంగాణ': రేవంత్‌

Revanth reddy fires on CM Kcr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వరాష్ట్రం వచ్చాక 'జయజయహే తెలంగాణ' పాటను కాలగర్భంలో కలిపారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర అధికారిక గీతంగా 'జయజయహే తెలంగాణ'ను ఆమోదిస్తామని హామీనిచ్చారు.

Revanth reddy fires on CM Kcr
Revanth reddy fires on CM Kcr

By

Published : Sep 12, 2022, 10:39 PM IST

Revanth reddy fires on CM Kcr: తెలంగాణ వచ్చాక ‘జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి ఐదు దశాబ్దాల పాటు మునుగోడు, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 17న నిర్వహించే కార్యక్రమాలు, మునుగోడు ఉప ఎన్నిక, భారత్‌ జోడో యాత్ర అజెండా తదితర అంశాలపై నేతల సూచలను కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

మన పేటెంట్‌ను భాజపా, తెరాస హైజాక్‌ చేస్తున్నాయ్‌..‘‘సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని భాజపా చూస్తోంది. ఇందుకోసం కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు. ఆనాడు రాచరిక పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛను అందించిన పార్టీ కాంగ్రెస్. మన పేటెంట్‌ను భాజపా, తెరాస హైజాక్‌ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. చరిత్రను కనుమరుగు చేసి కేసీఆర్‌ తనకు అనుకూలంగా రాసుకొంటున్నారు. వాస్తవ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపైనే ఉంది. టీఆర్‌ఎస్‌కు పర్యాయపదంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీన్ని సవరించి టీజీ పెట్టుకోవాలనేది ఒక ప్రతిపాదన’’ అన్నారు.

‘‘సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముంది. జాతీయ జెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక జెండా ఉండాలనే ప్రతిపాదనపై మీ సూచనలివ్వండి. మునుగోడు ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు 8యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయించాం. 300బూత్‌లను చూసుకోవడానికి 150 మందిని నియమించాలని పార్టీ భావిస్తోంది. ఇందులో అందరూ సమానమే.. చిన్న, పెద్ద తేడా ఏమీ లేదు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ అడ్డగోలుగా ధనబలాన్ని ఉపయోగిస్తాయి. మనం క్షేత్ర స్థాయిలో తెరాస, భాజపాను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి. '' - రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్

అక్టోబర్‌ 26న తెలంగాణకు జోడో యాత్రభారత్ జోడో యాత్ర దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. రాహుల్‌కు వస్తోన్న ఆదరణ చూడలేకే భాజపా చిల్లర మల్లర ప్రచారానికి దిగుతోందని ధ్వజమెత్తారు. అక్టోబర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణకు రాబోతోందని పేర్కొన్నారు. 15 రోజులపాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. మక్తల్ నుంచి మద్నూర్ వరకు 350 కిలోమీటర్లు యాత్ర సాగుతుందన్నారు. రోజుకు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి యాత్రలో పాల్గొనే అవకాశం కల్పించాలని భావిస్తున్నామని తెలిపారు. మూడు పెద్ద సభలు నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. మీ సూచనల ఆధారంగా వీటిపై నిర్ణయాలు తీసుకుంటామని అని పార్టీ నేతలకు రేవంత్‌ సూచించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details