భవిష్యత్ ఆదాయంపై అప్పులు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం కూడా తేల్చిన అంశంపై ఆర్థికమంత్రి బుగ్గన ఏం సమాధానం చెప్తారని.. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నెల రోజులుగా గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. భవిష్యత్ తరాల ఆదాయాన్ని చూపి అప్పులు తేవడం సరికాదని చెప్పామని గుర్తు చేశారు. గత నెల రోజులుగా తాను ఆర్థిక తప్పిదాలు జరుగుతున్నాయని బయటపెట్టిన అంశాలు కొన్నేనని పయ్యావుల అన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయని పయ్యావుల ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు.. రుణాలు ఇచ్చిన బ్యాంకులపైనా అత్యున్నత స్థాయి విచారణ జరిగి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యవస్థలను కుప్పకూల్చే యత్నాలను అడ్డుకుని తీరాలన్నారు. బ్యాంకులు కూడా అతిపెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నాయన్నారు. చట్టాన్ని రాజ్‌భవన్ అధికారులు అధ్యయనం చేశారా అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన దస్త్రం అధ్యయనం చేయకుండా సంతకం పెట్టారా అని అన్నారు. దస్త్రాన్ని తిప్పి పంపే అవకాశం ఉన్నా ఎందుకు చర్య తీసుకోలేదని పయ్యావుల నిలదీశారు. గవర్నర్‌ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద చర్చకు తెరలేపనుందని పయ్యావుల అన్నారు.