PAWAN ON TEACHERS DAY : ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం.. రాష్ట్రంలో కళావిహీనంగా మారడం బాధ కలిగిస్తోందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం వారు ఎంతగా నలిగిపోతున్నారో తెలియజేస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరూ.. చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. ఈ కబోది ప్రభుత్వానికి కళ్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అన్నారు. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఒక దేశం, ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని.. ఉపాధ్యాయ దినోత్సవం వేళ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు ప్రణామాలు అర్పిస్తున్నానని చెప్పారు. వేద కాలం నుంచి గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉందని.. తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారన్నారు. నెల్లూరులో తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ స్నేహితుల ద్వారా తన యోగక్షేమాల గురించి తెలుసుకుంటుంటారని.. అది తెలిసినప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుందని పవన్ అన్నారు.