విజయవాడలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఇంజినీరింగ్ విద్యార్థిని బలైపోయింది. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పవన్ అన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆశలతో ఉన్న బిడ్డ హత్యకు గురికావడం కన్నవారికి గర్భశోకాన్ని మిగులుస్తోందన్నారు. కొద్ది రోజుల కిందట విజయవాడలోనే ఓ నర్సు కూడా ఇలాగే ప్రేమ వేధింపుల బారినపడి చనిపోయిందన్నారు. కొవిడ్ కేంద్రంలో ఎంతో సేవ చేసిన ఆ యువతిని.. పెట్రోలు పోసి ఓ కిరాతకుడు హత్య చేశాడని ఆవేదన చెందారు. బాధితుల కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ హత్యలు అత్యంత హృదయవిదారకమన్నారు.
ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్ - విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని హత్యపై పవన్ కామెంట్స్
విజయవాడలో ఓ ప్రేమోన్మాది రాక్షసత్వానికి ఇంజినీరింగ్ విద్యార్థిని బలైపోయింది. ఈ ఘటన తననెంతో ఆవేదనకు గురిచేసిందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఉన్నత విద్య పూర్తిచేసి జీవితంలో ఎదగాలని ఆశ పడ్డ ఓ యువతి కలలు కిరాతకుడి చర్యలకు బలైపోయాయని ఆవేదన చెందారు. విద్యార్థినులు, యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల కేసులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటంగా ప్రారంభించిన దిశ చట్టం ఎవరికి రక్షణ కల్పించిందని పవన్ ప్రశ్నించారు.
'రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల కేసులు పెరుగుతుండటం దురదృష్టకరం. దిశ చట్టం చేశాం అని ప్రచారం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం ద్వారా ఏం సాధించింది..? ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ప్రయోజనం ఏమిటి..? ప్రచారానికి ఉపయోగపడటం తప్ప. అత్యాచారాల కేసుల్లో కేసుల నమోదు విషయంలోనూ పోలీసు శాఖ స్పందన సక్రమంగా ఉండటం లేదు. ఇటీవల తిరుపతిలో ఓ యువతిపై ఒక మత ప్రచారకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనపై కేసు నమోదు చేయకపోతే ఆ బాధితురాలు ‘స్పందన’లో ఫిర్యాదు ఇచ్చుకోవాల్సి వచ్చింది. పోలీసుశాఖ కఠినంగా వ్యవహరించి.. మహిళల రక్షణ కోసం చట్టాన్ని బలంగా ప్రయోగించాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించినప్పుడే.. మహిళలకు తమ రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై నమ్మకం కలుగుతుంది.'----పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి :ప్రేమంటూ తిరిగాడు... ఒప్పుకోలేదని చంపేశాడు...