ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుట్టినరోజు వేడుకలపై పవన్​ ఆసక్తికర కామెంట్స్..! - పవన్ పుట్టినరోజు

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో జనసేన శ్రేణులు, నాయకులు, అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు విలువైనవని, వారు తన పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు సామాజిక సేవా మార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ మరచిపోలేనన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. పార్టీ మీడియా విభాగంతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పవన్‌ జన్మదినోత్సవం సందర్భంగా జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్‌ కిట్లు వితరణ చేయడంలాంటి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి స్పందించాలని కోరగా.. పవన్‌ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Sep 2, 2020, 5:09 AM IST

ప్రశ్న: సహజంగా ఎవరైనా పుట్టిన రోజంటే ఆడంబరంగా వేడుకలు చేసుకుంటారు. వారికి తోచిన స్థాయిలో వేడుకలు జరుపుకొంటుంటారు. మీరు అందుకు భిన్నంగా వేడుకలకు దూరంగా ఉంటారు. ఇందుకు ఏమైనా కారణాలు ఉన్నాయా?

‘‘ప్రత్యేకించి కారణాలేమీ లేవు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు. ఒకట్రెండు సందర్భాల్లో స్కూల్‌లో చాక్లెట్లు పంచినట్టు గుర్తు. తర్వాత అన్నయ్య దగ్గరకు వెళ్లడం.. అటు నుంచి ఇటు రావడం ఈ ప్రక్రియలో పుట్టిన రోజుని నేను, నాతో పాటు మా ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవారు. రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కొనేవాడిని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటు లేదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బందిగా అనిపించింది. కేకు కట్‌ చేయడం, ఆ కేక్‌ తీసుకొచ్చి నోట్లో పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించి మానేశాను. అంతే తప్ప ప్రత్యేకంగా వేరే కారణాలేమీ లేవు’’

ప్రశ్న: మీ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసైనికులు వారోత్సవాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తొలి రోజున ఏపీలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు 341 ఆక్సిజన్‌ సిలిండర్‌ కిట్లు అందజేశారు. అలాగే చాలా చోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వీర మహిళా విభాగం సభ్యులు వన సంరక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

‘‘నా గురించి నేను పెద్దగా ఆలోచించను. అలాగే ఎక్కువగా ఊహించుకోను. నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్యతరగతి ఆలోచనా దృక్పథంతో ఉన్నానో.. ఇప్పటికీ అదేవిధంగా జీవిస్తున్నా. నన్ను లక్షల మంది అభిమానించడం, ఆదరించడం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘సుస్వాగతం’ సినిమా రిలీజ్‌ అయినప్పుడు థియేటర్‌లో ఫంక్షన్‌ ఉంది తప్పకుండా రావాలంటే ఇబ్బంది పడుతూనే కర్నూలు వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక రోడ్‌షో చేస్తూ తీసుకెళ్తాం అన్నారు. దేనికి? అని అడిగాను. మిమ్మల్ని చూడటానికి జనం చాలామంది వచ్చారని చెప్పారు. నన్ను చూడటానికి ఎవరొస్తారు అనుకున్నాను. ఆ వాహనం ఎక్కేటప్పటికి దారిపొడువునా విపరీతమైన జనం ఉన్నారు. వీళ్లందరూ నన్ను చూసేందుకే వచ్చారా? అనుకున్నాను. నాకు అప్పుడే అనిపించింది వాళ్లకు నాకు మధ్య పెద్ద తేడాలేదు. వాళ్లు అటువైపు ఉన్నారు.. నేను ఇటువైపు ఉన్నానంతే అని. అటువంటి ఆలోచనా విధానం వచ్చింది తప్ప నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారనే ఆలోచనా విధానం ఎప్పుడూ లేదు. నా ప్రమేయం లేకుండా నా పుట్టిన రోజు సందర్భంగా సేవా వారోత్సవాలు చేస్తున్నారంటే అది జనసైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం. వారికి నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఇందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అని పవన్‌ అన్నారు.

ఇదీ చదవండి

స్వర్ణ ప్యాలెస్ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు ప్రభుత్వం..!

ABOUT THE AUTHOR

...view details