నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు కనీసం రూ.35 వేలు పరిహారం ఇస్తేనే వారికి కొంత ఊరట లభిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తుపాను దాటికి నేలకు ఒరిగిన వరి కోత, నూర్చడానికి కూడా డబ్బులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంగా 35 వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చినా... ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల రైతులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలకు జనసేన పిలుపునిచ్చిందన్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా హైదరాబాద్లోని తన నివాసంలో సోమవారం ఉదయం పది గంటలకు దీక్ష చేపట్టారు. నివర్ తుపాను వల్ల దాదాపు 17 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
రైతన్నలు ఆర్థికంగా చితికిపోయారు
నాలుగు రోజులపాటు నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి రైతు ఆవేదనను గమనించానని పవన్ అన్నారు. ఇప్పటికే కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయామని, ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి విపత్తులు సంభవించడంతో చేతికొచ్చే దశలో పంటలు నీటి పాలయ్యాయని వారంతా చెప్పారన్నారు. ఎకరానికి పంట పెట్టుబడిగా రూ.50 వేలు వరకు ఖర్చు అవుతుందని... కనీసం పరిహారంగా 35 వేలు రూపాయలు ఇస్తే ఊపిరి పీల్చుకోగలమని రైతులు తెలిపారన్నారు. ఇప్పటివరకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... వాలిపోయిన వరి పనలు తీయడానికి కూడా డబ్బులు లేక నిరాశ, నిస్పృహలతో వారు చనిపోయారన్నారు.
మద్యం ఆదాయం రైతులకు కేటాయించండి
మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అవసరం లేదని పదేపదే చెప్పారని.. మేనిఫెస్టోలో కూడా పెట్టారన్నారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేస్తామన్నారని... నిషేధం మాట పక్కనపెడితే అమ్మకాలను మాత్రం ప్రోత్సహిస్తున్నారని పవన్ ఆరోపించారు. సుమారు రూ.16,500 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తోందని... ఆ ఆదాయాన్ని పంట నష్టపోయిన రైతులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.