ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కొద్దిపాటి జాగాలో సాగు చేసి ఆదాయం పొందే కార్యక్రమాన్ని చేపడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకృతి రైతు విజయరామ్ సలహా సహకారాలతో తన వ్యవసాయ క్షేత్రంలో పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మనకు విజ్ఞానాన్ని, చదువు, సంస్కారాన్ని అందించిన గురుదేవుళ్ళను సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా స్మరించుకొంటూ వ్యవసాయ విజ్ఞాన విషయాలను పంచే కార్యక్రమాన్ని చేపట్టామని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా యువతకు, రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని.. అదీ చిన్నపాటి భూమిలో సాగు చేయడం గురించి తెలియచేస్తామని వివరించారు. 250 గజాల్లో 81 మొక్కలు... ఒక క్రమ విధానంలో నాటి.. సాగు చేయడం ద్వారా ఏ విధంగా ఫల సాయం పొందవచ్చో తెలియచేస్తామన్నారు. ప్రకృతి రైతు విజయరామ్తో తనకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉందన్నారు. వారు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరిస్తూ ఉంటారన్న పవన్... విజయరామ్ సలహాలు ప్రకారం కొన్ని నమూనాలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.