రాష్ట్రంలో 2024 కంటే ముందే ఎన్నికలు రావచ్చని, ఆ దిశగా సన్నద్ధం కావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 'అధికారంలోకి వచ్చి ప్రజల కోసం నిలబడాలన్న బలమైన ఆకాంక్షతోనే పార్టీ పెట్టాను. జన బలాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో గత ఎన్నికల్లో విఫలమయ్యాం. మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం...' అని ప్రకటించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదుపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'భవిష్యత్తులో అధికారం అందుకోవాలి అంటే క్రియాశీలక సభ్యత్వం చాలా కీలకం. ప్రతి సభ్యుడూ కనీసం 50 మందిని ప్రభావితం చేసేలా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీకి అండగా నిలబడే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పే తెలుగుదేశం పార్టీ ఇవాళ ముందుకు వెళ్లడానికి ఎంతలా ఇబ్బందిపడుతుందో మనం చూస్తున్నాం. ఒక్క జన సైనికులు మాత్రమే ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా నిలబడుతున్నారు. అలాంటి వారిని క్రియాశీలక సభ్యులుగా తీసుకోండి'. అని చెప్పారు.
జనసేన ప్రధాన స్రవంతిలోకి రండి
'పార్టీలో ఇమడకుండా జనసేన మద్దతుదారులం అంటూ చిన్న చిన్న వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. సొంత అజెండాలతో వేరే వేరే వేదికలు రూపొందిస్తున్నారు. అలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకండి. ఎవరికైనా పార్టీ ద్వారానే గుర్తింపు రావాలి. ఎవరొచ్చినా సరే మద్దతు ఇవ్వాలి. జనసేన ప్రధాన స్రవంతిలోకి రావాలి. అప్పుడు పార్టీ కూడా మీతో నిలుస్తుంది. పార్టీ ద్వారా చేస్తానంటే సంతోషం. తమ విభాగాన్ని ప్రత్యేకంగా గుర్తించాలంటే ఎలా? పార్టీ ఉన్నదే ప్రజల కోసం నిలబడడానికి...' అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. 'ఎవరైనా నాయకులు నచ్చకపోతే సరైన కారణాలతో హేతుబద్ధతతో తెలియజేయాలి. ఎవరు ఇష్టమొచ్చినట్లు వాళ్లు విమర్శిస్తే కుదరదు. వంద మంది వెళ్లిపోతే వెయ్యి మందిని తీసుకువస్తాం. గడ్డాలు పట్టుకుని బతిమాలబోం. పార్టీలో బలమైన యువత ఉంది. వారి మనోభావాలను గాయపరచవద్దు...' అని పేర్కొన్నారు. రెండు వారాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ మద్యం, ఇసుక విధానాలు, మరికొన్ని సమస్యలపై సుదీర్ఘమైన చర్చ జరపాల్సి ఉందని పవన్ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని గ్రామ వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగారని, అలాంటి ఒత్తిళ్లను తట్టుకుని పవన్‌కల్యాణ్‌పై విశ్వాసంతో అంతా సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. నియోజకవర్గానికి 500 నుంచి వెయ్యి మంది క్రియాశీలక సభ్యులను తయారు చేసుకోగలిగితే వారంతా సైనికులుగా మారి పార్టీకి కుటుంబ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు అండగా ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, సత్య బొలిశెట్టి, 32 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు.