దివిస్ లాబోరేటరీస్ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి విషయాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో ఏర్పాటవుతున్న దివిస్ లాబొరేటరీస్ కర్మాగారం కారణంగా అక్కడి 15 గ్రామాలకు చెందిన వేల మంది ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులకు సోకడం లేదా అని ప్రశ్నించారు. ఆ కర్మాగారానికి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం అని తప్పించుకోవడానికి మంత్రి ప్రయత్నించడం ఎంత వరకు సబబని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఈ ప్రభుత్వం ఆపలేదా..? అని దుయ్యబట్టారు.
స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి....
దివిస్ కర్మాగారంపై అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పవన్ అన్నారు. కనీసం అరెస్టు చేసిన 36 మందిని సైతం విడిచిపెట్టలేరా..? అని ప్రశ్నించారు. ఆ 36మంది సూటు కేసు కంపెనీలు పెట్టి మోసాలు చేశారా.. ? లేదా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి క్విడ్ ప్రో కో చేశారా..? ప్రత్యర్ధులను పథకం ప్రకారం హతమార్చారా? అని నిలదీశారు. కేవలం పరిశ్రమ వద్దన్నందుకు అమాయకులను అరెస్టులు చేసి జైళ్లలో పెట్టడం ద్వారా కుటుంబాలకు శోకం మిగిల్చారన్నారు. 36 మందిని విడిచిపెట్టమని సమీక్షలో చెబుతున్నట్లు పత్రికల్లో చదివామని... కానీ ఇంకా వారంతా జైల్లోనే ఉన్నారన్నారని గుర్తు చేశారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏడాదిన్నర క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని.... ఈ ప్రకారం ఎంత మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయో మంత్రి చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు.
ఇదీ చదవండి
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై ఎస్ఈసీ అప్పీల్.. రేపు విచారణ