నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి కనీసం రూ.35వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దీక్ష చేపట్టారు. పరిహారం విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన 48 గంటల గడువు ముగియడంతో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఆయన ఈ దీక్ష చేశారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.16,500 కోట్లను రైతులకు సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తుపాను వల్ల నష్టపోయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రైతుల స్థితిగతులను పరిశీలించిన ఆయన పంట నష్టం కింద రూ.35 వేలు, అందులో తక్షణ సాయం కింద రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ శ్రేణులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నివర్ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 17 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఈ మధ్య తాను జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతుల ఆవేదన చూశానని చెప్పారు. ఇప్పటి వరకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.