టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత్‌కు రెండో వెండి పతకాన్ని అందించిన ఆటగాడు దహియాకు సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేధికగా అభినందనలు తెలిపారు. హరియాణాకు చెందిన రైతు బిడ్డ రవి దహియా.. టోక్యో ఒలింపిక్స్‌లో విజయం కోసం దేశం తరఫున పోరాడిన విధానం ప్రశంసనీయమైనదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. రెజ్లింగ్‌లో రజతం సాధించి మన దేశానికి మరో పతకం అందించిన రవి దహియాకు అభినందనలు తెలిపారు. నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన రవి కుమార్.. రెజ్లింగ్‌లో ఎదిగిన తీరు యువతీయువకులకు ఒక స్ఫూర్తి పాఠమన్నారు. రాబోయే రోజుల్లో రవి మరిన్ని ఘన విజయాలు సొంతం చేసుకుని మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు.
ఒలింపిక్స్ లో రజతం సాధించిన రవికుమార్‌కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రవికుమార్ అద్భుత ప్రదర్శనకు దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ విజయం దేశ ప్రజలందరిదని తెలిపారు. ప్రపంచ వేదికపై దేశ ఖ్యాతిని రవికుమార్ చాటారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.