‘‘మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి వైకాపా నాయకులకు ఓటు వేయవద్దు. వాళ్లు ఇచ్చే నోట్లకు ఆశపడి ఓట్లు వేస్తే మనల్ని యాచించే స్థాయికి తీసుకువెళ్తారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడాలి. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం రాత్రి పవన్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో పేర్కొంటూ తాను కోరుకునే మార్పు పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘‘పంచాయతీ ఎన్నికల్లో జనసేన 27శాతం ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో మేం బలంగా నిలబడటం వల్లే వైకాపా నాయకులు జనసేన కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల కన్నా పదింతల బీభత్సం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా నాయకులు సృష్టించారు. వీరి ధాటికి కాకలు తీరిన రాజకీయ పార్టీలే నిలబడలేకపోయాయి. జనసేన అభ్యర్థులను బెదిరించినా వారి దాష్టీకాలకు ఎదురొడ్డి యుద్ధం చేయగల సత్తా మా సైనికులకు ఉంది. ఆ యువబలమే మున్సిపల్ ఎన్నికల్లో ధైర్యంగా నిలబడింది. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీతో కలిసి జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మా కూటమికి మద్దతు ఇవ్వండి.. మేము అండగా నిలబడతాం’’ అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
వీళ్లని ఇలా వదిలేస్తే పేట్రేగిపోతారు
‘‘మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ప్రత్యర్థులు బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లు ఎదుర్కొన్నారు. ఎదురుతిరిగితే వారు రక్తపాతం సృష్టించారు. వైకాపాను ఇలా వదిలేస్తే వారు ఇంకా పేట్రేగిపోతారు. ఎదిరించే వ్యక్తులు లేకపోతే వీళ్ల దాష్టీకానికి అంతే లేకుండా పోతుంది’’ అని పవన్ ధ్వజమెత్తారు. ‘‘సత్తెనపల్లి నియోజకవర్గం దమ్మాలపాడులో వైకాపా అభ్యర్థి డబ్బు పంపిణీని అడ్డుకున్నారని జనసేన కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పాలకొల్లు నియోజకవర్గం ఏనుగువానిలంకలో విజయ్ భాస్కర్ అనే జనసైనికుడిని వైకాపా నేతలు ఇంటికెళ్లి విచక్షణారహితంగా కొట్టినా గట్టిగా నిలబడ్డాం. కారణం సమాజంలో మార్పు రావాలని కోరుకునే యువ సమూహం జనసేన వైపు బలంగా ఉండటమే. అమలాపురంలో 80 ఏళ్ల బామ్మ ముత్యాల మణి కుమారి జనసేనకు అండగా నిలిచారు’’ అని పవన్‌కల్యాణ్ వివరించారు.
హిట్లరే మట్టికొట్టుకుపోయాడు..మీరెంత?