ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రారంభాలు కాదు.. నిర్వాసితులకు న్యాయం జరగాలి: పవన్ - కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ఫేజ్ -2లో 23 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యం పెంచే పనులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తరవాతే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఫేజ్ 2 కోసం తాళ్లప్రొద్దుటూరుతోపాటు మరో 16 ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా ఖాళీచేయించడం దురదృష్టకరమని చెప్పారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Sep 8, 2020, 4:29 PM IST

కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ ఫేజ్ 2 పనుల కోసం.. నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండా.. పునరావాసం కల్పించకుండా హుటాహుటిన ఖాళీ చేయించడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చి, పునరావాస వసతులు కల్పించాకే ఖాళీ చేస్తామని నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తే.. వారిపై పోలీసు బెటాలియన్ దింపడాన్ని మండిపడ్డారు. ఈ విషయాన్ని జనసేన నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలాగా నిర్వాసితులపై పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి భయబ్రాంతులకు గురి చేయడం సరైన పద్దతి కాదన్నారు. పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో పర్యటిస్తున్నప్పుడు వంశధార ప్రాజెక్టు నిర్వాసితులను కలిశానని.. ప్రభుత్వం కల్పించిన వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక వారు పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశానన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి చెట్టుకొకరు.. పుట్టకొకరు చొప్పున చెదిరిపోయామని బాధితులు తమ గోడు చెబుతుంటే కళ్ళు చెమర్చాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించడం తప్ప.. నిర్వాసితులకు సరైన న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజల్లో ఎస్సీలు, బీసి వర్గాలు, పేద రైతులు ఎక్కువగా ఉన్నారని.. బాధితులకు సీఎం భరోసా కల్పించాలని చెప్పారు. లేదంటే జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ప్రజలకు ఇంత అన్యాయం జరిగిందనే సంకేతాలు బయటకు వెళ్తాయన్నారు. నిర్వాసితులకు సంపూర్ణ పరిహారం ఇచ్చి వారికి న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ కోరారు.

ఇదీ చదవండి:

దటీజ్ ఇండియన్ ఆర్మీ... మానవత్వంలోనూ భేష్

ABOUT THE AUTHOR

...view details