'కొత్త సీఎం...కొత్త రాజధానా... అమరావతి కదిపితే ఊరుకోం' జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. నిడమర్రు నుంచి ప్రారంభమైన పవన్ యాత్రకు ... రాజధాని రైతులు, జనసైనికులు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో రైతులను, రైతు కూలీలను కలుసుకుని వారితే మాట్లాడారు. రాజధాని పనులు నిలిచిపోవటం వలన తమకు పనులు దొరకటం లేదని నిడమర్రు, కురగల్లు ప్రాంతాల ప్రజలు పవన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు.
నిర్మాణాల పరిశీలన...స్థితిగతులపై ఆరా
అనంతరం రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను పవన్ పరిశీలించారు. కొండవీటి వాగుపై నిర్మించిన వంతెన, అంబేడ్కర్ స్మృతివనం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ప్రభుత్వ అధికారుల నివాస భవనాల పనుల తీరును ఆరా తీశారు. భూసమీకరణ సమయంలో ప్రభుత్వ వైఖరి.. అలాగే రైతులకు పట్టాల పంపిణీ గురించి వారితో మాట్లాడారు. నిర్మాణ పనులు ఆగిపోయిన తర్వాత రాజధానిలో ప్రజల పరిస్థితి, చిన్నచిన్న వ్యాపారాలు, ఇతర ఆర్థిక వ్యవహారాల గురించి అడిగి తెలుసుకున్నారు.
బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరమా...?
అక్కడి నుంచి తుళ్లూరు చేరుకుని, సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంత్రి బొత్స వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజధాని మారుతుందనే వ్యాఖ్యలు చేస్తున్న బొత్స సత్యనారాయణ... రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే విజయనగరంలో రాజధాని ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు.
భాగ్యనగరం తరహా రాజధాని
రాజధానికి అధిక వ్యయం అవుతుందన్న బొత్స మాటలపై స్పందిస్తూ... నిర్మాణానికి అవసరమైన నిధులు ముఖ్యమంత్రి జగన్ జేబులో నుంచి ఇవ్వరని వ్యాఖ్యానించారు. ప్రజలు కట్టే పన్నుల నుంచే రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. రాజధాని విషయంలో ఏవైనా అవినీతి, అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాని ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం సరికాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలో ఏపీకి కూడా రాజధాని అవసరమని పవన్ ఆకాంక్షించారు.
సీఎం స్పష్టత ఇవ్వాలి
జగన్ సీఆర్డీఏ సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా రైతులలో ఆందోళన తొలగలేదన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా అమరావతిపై స్పష్టత ఇవ్వాలని పవన్ కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఓసారి రాజధాని ప్రాంతంలో పర్యటించి వాస్తవ స్థితిగతులు పరిశీలించాలని సూచిస్తున్నారు. రాజధాని పనులు ఆపేసి.. అభివృద్ధి నిలిపివేస్తే భూములు ఇచ్చిన రైతుల సంగతేంటని జనసేనాని ప్రశ్నించారు.
నేడు రైతులతో భేటీ
పవన్ అమరావతి పర్యటనతో రైతులు, ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఉండవల్లి కరకట్ట మీదుగా వెళ్లే సమయంలో కూల్చిన ప్రజావేదికను జనసేన నేతలు పవన్‌కు చూపించారు. అక్కడి నుంచి ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఇవాళ రాజధాని ప్రాంత రైతులతో మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ భేటీ కానున్నారు.
ఇదీ చదవండి :
'రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'