వైకాపా వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. మొత్తం 9 అంశాలను పొందుపరుస్తూ... ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులు నిలిపివేతతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వరద నియంత్రణ వంటి అంశాలను నివేదికలో తెలిపారు.
ఇసుక విధానంపై పవన్ వ్యాఖ్యలు వైకాపా వంద రోజల పాలనపై నివేదిక విడుదల అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జనరంజక పాలన చేస్తామని.. అలాంటిదేమీ చేయలేదని ఆరోపించారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేదని..దీనితో భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఉపాధి అవకాశాలు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని దుయ్యబట్టారు.ఈ నష్టాన్ని పూడ్చలేనిదని అన్నారు. ఇసుక మాఫియాను ఆపుతామని చెప్పారే కానీ ఎలాంటి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదని ఉద్ఘాటించారు.
పింఛన్ల మాట ఏమైంది?
వైకాపా ప్రభుత్వానికి దార్శనికత లోపించిందని పవన్ అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.15 వేల పింఛన్ ఇస్తామన్నారు.. కానీ ఈ మూడు నెలల కాలంలో అందాయో లేదో తెలియదని విమర్శించారు. కృష్ణాజిల్లాలోనే వేల మంది డెంగీ, మలేరియాతో బాధపడుతున్నారంటూ రాష్ట్రంలోని ప్రజారోగ్యం అంశాన్ని ప్రస్తావించారు.
అవినీతి జరిగితే..
పోలవరం నిర్మాణ పనులు నిలిపివేయటం ప్రభుత్వ తప్పిదమే అని పవన్ అభిప్రాయపడ్డారు. అవినీతి జరిగితే తప్పకుండా విచారణ జరిపించండి అన్నారు. నిర్మాణం ఆపేస్తే రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టడమే అని వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో గత తెదేపా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు.. వైకాపా ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఎందుకు గెజిట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. గెజిట్ విషయంలో వైకాపా ప్రభుత్వ సమర్థత ఏది అంటూ దుయ్యబట్టారు. వాళ్లకు జన్మభూమి కమిటీలు..వీళ్లకు వాలంటీర్లు
వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు: పవన్ తెలుగుదేశం పార్టీని జన్మభూమి కమిటీలు ఏ విధంగా దెబ్బతీశాయో... వైకాపాను కూడా వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతీస్తుందని పవన్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయటం కోసమే వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొచ్చారని ఆరోపించారు. కృష్ణా నదికి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే... మంత్రులు మాత్రం మాజీ సీఎం ఇంటి చుట్టూ తిరిగారంటూ పవన్ చురకలంటించారు. ఇంత వరద వచ్చినా రాయలసీమకు చుక్కనీరు ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్టుబడులు లేవు
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన అనేక పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. అలా వెళ్లిన కంపెనీలతో కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదని అన్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులు రద్దు చేశారని పవన్ వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణకు..
కోడి కత్తి విషయంలో రాద్దాంతం చేశారని జనసేన అధినేత ఆరోపించారు. జగన్ ప్రమాణం చేసిన తర్వాత రోజే దాడి చేసిన వ్యక్తి బయటికు వచ్చాడని అన్నారు. జగన్ చిన్నాన్న హత్య విషయంలో దర్యాప్తు ఎక్కడివరకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం స్పందించకపోతే... అఖిలపక్షం పెట్టి సీబీఐ విచారణకు పట్టుబడాతనని హెచ్చరించారు.
రైతుల కన్నీరు క్షేమం కాదు
వైకాపా వంద రోజల పాలనలో నిరుద్యోగం తగ్గింపునకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న పవన్... విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇవాళ్టికీ మరుగుదొడ్లు లేవని విమర్శించారు. మరుగుదొడ్లు లేక పిల్లలను పాఠశాలలు మాన్పిస్తున్నారని తెలిపారు.
మద్యపానంలోనే అభివృద్ధి
మద్యపానంలో అభివృద్ధి: పవన్ ఈ మూడు నెలల్లో అభివృద్ధి ఉందంటే కేవలం మద్యపానంలోనే అని ఘాటుగా స్పందించారు. మద్యపాన నిషేధమన్నారు...బీరు వినియోగం 13 శాతానికి పెరిగిందని ఎత్తిచూపారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రశ్నార్థకంగానే ఉందన్నారు.