లాక్‌డౌన్ కారణంగా నగరంలో ఉపాధి లేక ఊరుబాట పడుతున్న వలస కార్మికులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఆరేడు గంటల్లో గమ్యస్థానం పోవాల్సింది.. రోజుల తరబడి ప్రయాణించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. రైలు ఏ సమయానికి ఉన్నా.. లాక్‌డౌన్‌తో ఇంటిల్లిపాదీ ఉదయం 10 గంటలలోపే రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. ఆరుబయట ఎండలో పిల్లాపాపలతో.. బండెడు సామానుతో.. ఆకలితో ఎదురుచూడాల్సి వస్తోంది. తాగునీరు కూడా దొరకడం లేదని పలువురు ప్రయాణికులు వాపోయారు. మరోవైపు తెలంగాణలోని ఎంజీబీఎస్, జేబీఎస్ స్టేషన్లలో మరుసటి రోజు బస్సు ప్రయాణానికి ముందు రోజు నుంచే పడిగాపులు కాయాల్సి వస్తోంది.
పరిమితంగానే అనుమతి..
స్టేషన్లో రద్దీ ఎక్కువైతే.. కరోనా ముప్పు ఉంటుందని భావించిన రైల్వే అధికారులు రైలు వచ్చే సమయానికి గతంలో గంట ముందు అనుమతించేవారు.. ఇప్పుడు రెండు గంటల వరకూ పెంచారు. లాక్‌డౌన్ పొడిగిస్తారేమో అనే భయంతో వలస కూలీలు సొంతూరు బాట పడుతున్నారు. వీరంతా ఉదయం 10 గంటలలోపు స్టేషన్‌కు చేరుకుని బయటే ఎదురు చూస్తున్నారు. హోటళ్లన్నీ మూతపడ్డాయి. తెచ్చుకున్న అల్పాహారం అయిపోయింది. రేపంతా ప్రయాణం చేయాలి.. ఆకలితో పిల్లలు అలమటిస్తున్నారని వాపోయారు. ఇదే పరిస్థితి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్, రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైల్వే ప్రయాణికులది కూడా.
రేపటి బస్సుకోసం నేటి నుంచే..
ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో వలస కూలీలు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ నుంచి వచ్చిన ఓ కుటుంబం ఉదయం 10 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. వారు అచ్చంపేట వెళ్లాల్సి ఉంది. ఈ రోజు 10 గంటలకు ఇక్కడకు చేరుకున్న వెంటనే బస్సుంటే మధ్యాహ్నానికి ఇంటికి చేరేవారం. కాని లాక్‌డౌన్‌తో మరి బస్సులు లేవు. శుక్రవారం తెల్లవారు జామున బయలుదేరే బస్సు కోసం ఎదురు చూస్తున్నామని సదరు కుటుంబసభ్యుడు యాదగిరి చెప్పారు. నిజామాబాద్, యాదాద్రి, ఆదిలాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో ఉన్న వలస కార్మికులు హైదరాబాద్ వరకూ వచ్చి మరుసటి రోజు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇలా దాదాపు 800 మంది వలస కార్మికులు బస్సుస్టేషన్లకు చేరువలో ఉన్న చెట్లకింద, మెట్రో స్టేషన్ కింద ఎదురు చూస్తున్నారు.
స్టేషన్ నుంచి ఇంటికి చేరేదెలా..?