వైకాపా ప్లీనరీ ప్రభావం పల్లెవాసిపై పడింది. 80-90 శాతం పల్లె వెలుగు సర్వీసులను ప్లీనరీకి పంపడంతో.. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేవారు శనివారం తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాక ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ప్రైవేటు వాహనాలవారు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేశారు. తెనాలి డిపోలో దగ్గర ప్రాంతాలకు తిరిగే 78 బస్సుల్లో 70 వైకాపా ప్లీనరీకి వెళ్లాయి. మిగిలిన 8 బస్సుల్లో తెనాలి- విజయవాడ మధ్య ఆరు, తెనాలి- గుంటూరు మధ్య రెండింటిని నడిపారు. మిగిలిన మార్గాల్లో బస్సులను రద్దు చేశారు. గ్రామాలవైపు బస్సులే వెళ్లలేదు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని చాలా డిపోల్లోనూ శనివారం ఇదే పరిస్థితి.
30 డిపోల్లో ప్రభావం
ప్లీనరీ కోసం మొత్తం 1,812 బస్సులు వెళ్లినట్లు అధికారులు లెక్క తేల్చారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని 16 డిపోల పరిధిలో 1,600, ప్రకాశం జిల్లాలోని 5 డిపోల నుంచి 212 బస్సులు ప్లీనరీకి పంపారు. కొన్ని డిపోల్లో బస్సులు తక్కువగా ఉన్నా ప్లీనరీకి ఎక్కువ సంఖ్యలో కావాలని కోరడంతో.. ఇతర జిల్లాల నుంచి రప్పించి పంపారు. కృష్ణా జిల్లాలోని 5 డిపోల నుంచి 189 బస్సులు గుంటూరు జిల్లాలోని వివిధ డిపోలకు సర్దుబాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచీ కొన్ని బస్సులు పంపారు. దీంతో ఆయా డిపోల్లోనూ కొరత ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల పరిధిలో 30 డిపోల్లో రెగ్యులర్ సర్వీసులు రద్దయ్యాయి. అటు పశ్చిమగోదావరి, భీమవరం, ఇటు నెల్లూరు జిల్లాల నుంచి బస్సులు ప్లీనరీకి వెళ్లడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.
- గుంటూరులో 5 డిపోల పరిధిలో.. 370 బస్సులుంటే 230 ప్లీనరీకి పంపారు. పెదకాకాని ప్రార్థనా మందిరంలో రెండో శనివారం ప్రత్యేక ప్రార్థనలకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చినవారు విజయవాడ నుంచి పెదకాకానికి చేరుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జీపుల్లో ఒక్కొక్కరికి రూ.250 తీసుకుని, మంగళగిరిలోనే దింపేసి వెళ్లిపోయారని పలువురు వాపోయారు.
- సత్తెనపల్లి డిపో పరిధిలో 65 బస్సులుంటే.. ప్లీనరీకి 40 వెళ్లడంతో చాలా సర్వీసులు రద్దయ్యాయి.
- పశ్చిమగోదావరి జిల్లా నుంచి 90, ఏలూరు జిల్లా నుంచి 77 బస్సులు ప్లీనరీకి వెళ్లడంతో గ్రామాలకు వెళ్లే చాలా సర్వీసులు రద్దయ్యాయి.