ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bypoll Munugode Bypoll: నేటితో ముగియనున్న నామినేషన్లపర్వం... తారాస్థాయికి ప్రచారం - మునుగోడు ఉపఎన్నికపై కేసీఆర్ ఫోకస్

Munugode: ఊరూరా కీలక నేతలు మొహరించారు. గల్లీగల్లీన కార్యకర్తలు గస్తీ కాస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కీలక ఉపఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం మునుగోడులో కేంద్రీకృతమైంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గంలో మకాం వేయగా.... విపక్షాలు సైతం అదే స్థాయిలో హడావిడి చేస్తున్నాయి. పోలింగ్‌ గడువు మరో పక్షం రోజులే ఉండటంతో.... జోరుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

మునుగోడు ఉపఎన్నిక
munugode bypoll

By

Published : Oct 14, 2022, 12:09 PM IST

munugode bypoll in Telangana: మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లపర్వం చివరిదశకు చేరటంతో ఇక ప్రచారంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాలకు చెందిన నేతలంతా.. మునుగోడులోనే మకాం వేశారు. నిన్న తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ సహా మంత్రుల సమక్షంలో నామపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలతో కలిసి కేటీఆర్.. బంగారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగేళ్లు.. నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అభివృద్ధి కోసం రాజీనామా అని చెప్పడం హాస్యాస్పదమని కేటీఆర్‌ విమర్శించారు. డబ్బులతో గెలవాలని చూస్తున్న భాజపాకు ఓటుతో బుద్ధి చెప్పాలన్న ఆయన,ఉపఎన్నికలో తెరాసను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అనంతరం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్‌ అక్కడే భోజనం చేశారు.

రేపటి నుంచి ఉపఎన్నిక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కమలదళం నిర్ణయించింది. ఊరూరా ముఖ్యనేతల ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఆ పార్టీ నాయకత్వం రెండు విడతలుగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, ఎంపీ అర్వింద్, రఘునందన్‌రావు, విజయశాంతి, బాబుమోహన్‌తో కూడిన 11మంది నేతల జాబితా సిద్ధంచేశారు. ఈనెల 18 నుంచి ప్రచారం ముగిసే వరకు గ్రామాల్లో బండి సంజయ్‌ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కిషన్‌రెడ్డి రేపటి నుంచి మూడ్రోజులపాటు ప్రచారం చేయనున్నారు. రెండో విడతలో 25 నుంచి జాతీయస్థాయి నేతలు పర్యటించనుండగా.. 29న భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామగ్రామాన రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తుండగా, ఆయన సతీమణీ ప్రచారం ప్రారంభించారు. నిన్న చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి సతీమణి లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మునుగోడు మండలం కొరటికల్‌లో ప్రచారం చేసిన రాజగోపాల్‌ రెడ్డి తెరాసతో చేస్తున్న ధర్మయుద్ధంలో ఆశీర్వదించాలని కోరారు.

మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. నారాయణపూర్ మండలం సర్వెల్ గ్రామంలో పార్టీ నేత గండ్ర సత్యనారాయణతో కలిసి స్రవంతి ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.

డబ్బులతో గెలవాలని చూస్తున్న తెరాస, భాజపాలను ఓడించాలని ఐక్యవేదిక నేతలు కోరారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనుండగా.. భారీ జనసమీకరణకు కాంగ్రెస్‌ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. నామినేషన్‌ సందర్భంగా బంగారుగడ్డ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించనున్నారు. మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ఇప్పటి వరకు 56 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 24మంది నామినేషన్లు వేయగా.. 35సెట్లు అందినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details