Parliament Winter Sessions 2021 Updates: లోక్‌సభలో తెరాస ఎంపీలు ఆందోళన(Trs mps protest in loksabha) చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. పార్లమెంట్‌లో తొలిరోజే ప్రశ్నోత్తరాల సమయం మొదలు కాగానే.. ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో తెరాస ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ బిర్లా సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం ఎంపీలు సెంట్రల్ హాల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.
కేంద్రం తీరు సరిగా లేదు..
ధాన్యం సేకరణ(Paddy Procurment in Telangana)పై స్పష్టత కోసం పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఇచ్చిన పిలుపు మేరకు.. తొలిరోజే లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయోమయ, అస్పష్టత విధానానాలతో తెలంగాణ రైతులతో పాటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ఆక్షేపించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు.