ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మందకొడిగా.. పరిషత్ ఎన్నికల పోలింగ్ - parishat elections

రాష్ట్రంలో.. పలు కారణాలతో ఎన్నిక జరగకుండా మిగిలిపోయిన పరిషత్ స్థానాలకు ఇవాళ ఎన్నిక జరుగుతోంది. మొత్తం పది జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ స్థానాల పరిధిలో.. 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

parishath-poling
ఇవాళ పరిషత్ పోరు.. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం

By

Published : Nov 16, 2021, 6:42 AM IST

Updated : Nov 16, 2021, 1:52 PM IST

రాష్ట్రంలో.. స్థానిక సంస్థలు ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ గతంలోనే నిర్వహించింది. అయితే.. వివిధ కారణాలతో పలు చోట్ల ఎన్నిక జరగలేదు. అలాంటి స్థానాలకు ఇప్పుడు వరుసగా ఎన్నికలు నిర్వహిస్తోంది. సోమవారం కార్పొరేషన్, మునిసిపల్, పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం మిగిలిపోయిన పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొత్తం పది జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నిక జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ స్థానాల పరిధిలో.. 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం 954 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ వినియోగిస్తోంది. అవసరమైన చోట బుధవారం రీ-పోలింగ్‌ నిర్వహిస్తారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రటిస్తారు.

మందకొడిగా ప్రారంభం..
చాలా ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. సాయంత్రం వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉండడంతో.. ఓటర్లు మెల్లగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న పార్టీలు.. పోలింగ్ కేంద్రాలకు కాస్త దూరంలో ప్రచారం చేయడం కనిపించింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ వేగం పుంజుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సజావుగా సాగేనా?
సోమవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. దొంగ ఓట్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు అధికార పార్టీ స్థానికేతరులను తరలించి, వారితో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిందని తెదేపా శ్రేణులు పలుచోట్ల ఆందోళనలకు దిగాయి. పోలీసులు, ఎన్నికల సిబ్బంది అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ నిరసన తెలిపాయి. కుప్పంలో బయటి వ్యక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఓ విద్యాసంస్థలో గుమికూడటాన్ని తెదేపా శ్రేణులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అక్కడ మొదలైన వివాదం.. రోజంతా ఉద్రిక్తతకు దారితీసింది.

దర్శిలోనూ దొంగ ఓట్లపై తెదేపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరులో వైకాపా అభ్యర్థి ఇంటి వద్దే డబ్బులు పంచుతున్నారంటూ విపక్షాలు అధికారుల దృష్టికి తెచ్చారు. నెల్లూరులోనూ నకిలీ ఓటర్లు పోటెత్తారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై తెదేపా రాష్ట్ర నాయకత్వం విజయవాడలో ఎస్‌ఈసీ నీలం సాహ్నీని కలిసి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పానికి పెద్దఎత్తున చేరుకున్న ఇతర ప్రాంతాల వారిని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. తిరిగి తెదేపా శ్రేణులపైనే లాఠీఛార్జి చేశారంటూ ఆగ్రహించారు.

ఈ పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని అన్నారు. "ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా? గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు." అని ధ్వజమెత్తారు. తప్పుడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. దొంగ ఓట్లు పోలై ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మంగళవారం జరిగే ఎన్నికలు ఎలా సాగుతాయా? అనే చర్చ సాగుతోంది.

Last Updated : Nov 16, 2021, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details