జట్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జడ్పీటీసీ బరిలో 2058 మంది, ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఫలితాల వెల్లడిని మాత్రం హైకోర్టు నిలుపుదల చేసింది. ఈనెల 15 తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ఈ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,46,71,002 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
నిలిచిపోయిన స్థాయి నుంచే మళ్లీ...
ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే... పరిషత్ ఎన్నికలకు నీలం సాహ్ని షెడ్యూలు ప్రకటించారు. గతంలో నిలిచిపోయిన స్థాయి నుంచి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. 8న పోలింగ్, 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ విడులైంది. కానీ... న్యాయస్థానం తాజా ఆదేశాల ప్రకారం ఫలితాలు ఎప్పుడు వెల్లడయ్యేది 15న తేలనుంది. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణపై దృష్టిపెట్టారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసొచ్చాక వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్, ఎన్నికల సంఘం కార్యదర్శి, అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్, ఇతర అధికారులతో సమావేశమై.... డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు.
ఏకగ్రీవాలు ఎన్ని..?
కిందటి ఏడాది మార్చిలో 9,984 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, వివిధ కారణాలతో వీటిలో 288 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదు. మిగతా 9,696 స్థానాల్లో 2,371 ఏకగ్రీవమైనట్లు పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. 660 జడ్పీటీసీ స్థానాల్లో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించట్లేదు. మిగిలిన 652 స్థానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాల్లో కడప, చిత్తూరు జిల్లాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు 432 (78.11%), 50 జడ్పీటీసీ స్థానాలకు38 (76%) ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో 858 ఎంపీటీసీ స్థానాలకు 433 (50.46%), 65 జడ్పీటీసీ స్థానాల్లో 30 (46.15%) ఏకగ్రీవమైనట్లు అధికారులు వివరించారు.
ఏకగ్రీవాలపై అభ్యంతరాలు...
పరిషత్ ఎన్నికల్లో ఏగ్రీవాలపై ప్రతిపక్ష పార్టీలు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇతరులను నామినేషన్ వేయనివ్వకుండా చేశారని ఆరోపించాయి. దీని గురించి తెదేపా సహా ఇతర పార్టీలు ఎస్ఈసీకీ లేఖ రాశాయి. ఈ స్థాయిలో ఏకగ్రీవాలు కావడంపై అనుమానం వ్యక్తం చేశాయి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు పలు పార్టీల నేతలు ఆయన్ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు.