ఎన్నికలు నిర్వహించిన 515 జడ్పీటీసీల్లో 504 (97.86%), 7,219 ఎంపీటీసీల్లో 5,997 (83.07) స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. ఆరు జడ్పీటీసీ, 827 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. కడియం (తూ.గో.జిల్లా), వీరవాసరం (ప.గో.జిల్లా) జడ్పీటీసీ స్థానాలను జనసేన దక్కించుకుంది. 177 ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. విశాఖ జిల్లా అనంతగిరి జడ్పీటీసీ స్థానాన్ని సీపీఎం చేజిక్కించుకుంది. అనంతపురం జిల్లా రోళ్లలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థి గెలుపొందారు. కడప జిల్లా జమ్మలమడుగు జడ్పీటీసీ స్థానం పరిధిలోని రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు నీటితో తడిచిపోవడంతో లెక్కింపునకు అంతరాయం ఏర్పడి, ఫలితాలు నిలిపివేశారు. ఎంపీటీసీ స్థానాల్లో భాజపా 28 చోట్ల, సీపీఎం 15, సీపీఐ 8, కాంగ్రెస్ 4, స్వతంత్రులు 136 చోట్ల, ఇతరులు మరో 19 స్థానాల్లో గెలిచారు. బీఎస్పీ ఒక ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించింది. బ్యాలెట్ పెట్టెల్లోకి నీళ్లు చేరడంతో ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు నిలిపివేశారు.
జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు
ఈ నెల 24న మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), ఉపాధ్యక్షులు, 25న జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపైనా సూచనలు చేసింది. విజేతలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు.. జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడానికి నిర్వహించే ప్రత్యేక సమావేశానికి విధిగా హాజరుకావాలని జిల్లాల్లో అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. జిల్లా పరిషత్తుల్లో రెండో వైస్ ఛైర్మన్‌ను కూడా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ మేరకు రెండో వైస్‌ఛైర్మన్లను జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకోవచ్చని కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఒక జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్