Secunderabad riots update : సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలంలోని దేవునిపల్లికి చెందిన చెన్నయ్య కుమారుడు మహేశ్‌కుమార్ పాల్గొన్నాడంటూ అతడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. మహేశ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు మండల పరిధిలోని ఎలికట్టలో ఒక ఆర్మీ శిక్షణ సంస్థలో తర్ఫీదు పొందాడు. కానిస్టేబుల్ పరీక్ష కోసం షాద్‌నగర్‌లో నిర్వహించిన ఉచిత కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నాడు.
అల్లర్లు జరిగిన రోజున కోచింగ్ సెంటర్ నిర్వాహకుల ఒత్తిడి మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లొచ్చాడు. ఆ ఘటన అనంతరం.. సోమవారం పోలీసులు గ్రామానికి వచ్చి తమ కుమారుడిని తీసుకెళ్లారని మహేశ్ తండ్రి తెలిపారు. మూడు రోజులైనా మహేశ్ ఎక్కడున్నదీ తెలియడం లేదన్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి వాకబు చేసినా ఫలితం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.