రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవాల పేరిట విడుదల చేస్తోన్న ప్రకటనలు, మంత్రుల వ్యాఖ్యలను ఎస్‌ఈసీ సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ, జనసేన సంయుక్తంగా డిమాండ్ చేశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఇరుపార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సాధ్యమైనన్ని గ్రామ పంచాయతీల్లో ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రకటించారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతమై నిర్వహించిన సమావేశం వివరాలను భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నుంచి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు.
ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికలు సజావుగా జరిగేలా సర్కార్ సహకరించాలి. అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బెదిరించే ధోరణిని అరికట్టాలి. ఆన్‌లైన్‌లో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల కమిషన్ అనుమతించాలి. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తాం. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తే వెంటనే గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం -సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు