ధర్మబద్ధమైన పాలనతో పాటు.. పాడి పంటలతో ప్రజలు సుభిక్షమే లక్ష్యంగా వ్యవసాయ, నీటి వనరులకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కాకతీయ రాజులు వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు నిర్మించిన ప్రధాన తటాకాల్లో.. పాకాల చెరువు ప్రధానమైనది. గణపతి దేవుని కాలంలో 1213లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులో.. 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో చెరువును నిర్మించారు. చారిత్రక సంపదగా అన్నదాతల పెన్నిదిగా నిలిచే పాకాల సరస్సు.. పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ధి చెందింది. నర్సంపేటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సరస్సు చుట్టూ.. 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి అభయారణ్యం ఉంది.
పాకాల చెరువు మధ్యలో ఉన్న కొండతో పాటు.. ఉద్యానవనం సమీపంలోని పాకాల గుట్ట, సరస్సు అందాలను వీక్షించేందుకు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఉన్నాయి. వానాకాలం వచ్చిందంటే.. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకులను కట్టిపడేస్తుంటాయి. అభయారణ్యంలో జంతువులు, అరుదైన పక్షుల సందడితో పాటు సరస్సు అందాలు, హరిత సొబగులు.. సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి.