తడిసిన ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉన్న చోట మొలకలు వస్తున్నాయి. నిబంధనలు సడలించి ప్రభుత్వం వీటిని కొనకపోతే రైతులు మరింత నష్టపోనున్నారు. కోతలు మొదలైన ప్రాంతాల్లో సేకరణ ప్రక్రియ ప్రారంభించడంలోనూ పౌరసరఫరాల శాఖ జాప్యం చేస్తోంది. సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే నిండా మునిగిపోతామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఇంకా ఎడతెరపిలేని వానలే
ఎడతెరపిలేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టమేర్పడింది. మెట్ట పంటలతోపాటు కోత దశలో ఉన్న వరి కోలుకోలేని విధంగా దెబ్బతింది. మొత్తంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిందని అంచనా. ఉభయగోదావరి, కడప జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల కోతలు కోశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ నూర్పిళ్లు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఇది రంగు మారడంతోపాటు మొలకలూ వస్తోంది.
ఆరబెట్టే సమయమేది?
ధాన్యాన్ని ఆరబెడదామంటే వర్షం భయం పొంచి ఉంది. మళ్లీ తడిస్తే గింజ కూడా చేతికి రాదనే ఆందోళనలో రైతులున్నారు. అలాగని మొత్తం రాశులుగా చేసి పట్టాలు కప్పి ఉంచినా నష్టమే. తేమ ఎక్కువగా ఉండటంతో గింజ వేడెక్కి మొలకలు వస్తోంది. నిబంధనల ప్రకారం.. ధాన్యంలో 17% వరకు తేమను అనుమతిస్తారు. అంతకుమించి ఉంటే ఆరబెట్టుకుని తీసుకురమ్మంటున్నారు.
- వరి కోసి కుప్పలుగా వేసి నూర్పిడి చేస్తే ఈ మేరకు తేమ ఉంటుంది. యంత్రాలతో కోతల నేపథ్యంలో ధాన్యంలో తేమ ఎక్కువగానే ఉంటుంది. అందుకే రైతులు 1,2 రోజులు ఆరబెడతారు. అయినా తేమ ఉందంటూ ధర తగ్గించడం రివాజుగా మారింది.
- భారీ వర్షాలు, ముసురు వాతావరణం నేపథ్యంలో వరిలో తేమ ఎక్కువగానే ఉంది. 20% నుంచి 22% వరకుండే అవకాశముందని రైతులే పేర్కొంటున్నారు.