ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రాణవాయువుకు దూరమే భారం!.. పొరుగు రాష్ట్రాల నుంచి తప్పని సేకరణ - ap latest news

ఏ క్షణంలో ఆక్సిజన్‌ నిండుకుంటుందో, ఎప్పుడు రోగులకు సరఫరా నిలిచిపోతుందో తెలియని అయోమయం రాష్ట్రంలోని కొన్ని ఆసుపత్రుల్లో కనిపిస్తోంది. ఆక్సిజన్‌ కేటాయింపును కేంద్రం కొంత పెంచినా.. అది రాష్ట్ర అవసరాలకు సరిపోవడం లేదు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోని దూర ప్రాంతాలనుంచి ఆక్సిజన్‌ను తెచ్చుకోవడం, రవాణాకు తగినన్ని వాహనాలు లేకపోవడం, ఆసుపత్రుల్లో ఒకటి రెండు రోజులకు సరిపడానైనా నిల్వ సామర్థ్యం లేకపోవడం ఈ దురావస్థలకు కారణమవుతోంది. ఏ కారణంతోనైనా ట్యాంకరు రావడం ఆలస్యమైతే వందలాది రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారులను నియమించింది. వార్‌రూమ్‌లు ఏర్పాటుచేయడంతోపాటు గ్రీన్‌ఛానల్‌ ద్వారా రవాణాకు అవాంతరాలను తొలగిస్తోంది.

oxygen supply in state
oxygen supply in state

By

Published : May 12, 2021, 6:50 AM IST

తిరుపతి రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి కొద్దిసేపు ఆక్సిజన్‌ సరఫరా నిలిచి పలువురు చనిపోయారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరు నుంచి ఆక్సిజన్‌ ట్యాంకరు రావడంలో కాస్త జాప్యమైనందునే అంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరే ఇతర అవాంతరమో ఏర్పడి అదే ట్యాంకరు పూటనో, అర్ధరోజు ఆలస్యమైతే పరిస్థితేమిటి? అన్న ప్రశ్న భయపెట్టిస్తోంది.

వచ్చే డిమాండ్‌ను తట్టుకునేదెలా?

ప్రస్తుతం రాష్ట్రానికి రోజుకు 590 టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే సరఫరా అవుతుంది. ఇది వచ్చింది వచ్చినట్టే అయిపోతోంది. ఈనెల 15కే రోజుకు 800 టన్నులకు ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుందని అంచనా. ఆక్సిజన్‌ కోటా రోజుకు 910 టన్నులకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదో పెద్ద సంక్షోభంగా మారకుండా కేంద్రం రాష్ట్ర అవసరాలకు తగినంతగా ఆక్సిజన్‌ కేటాయించాల్సి ఉంది. వాహనాల్ని సమకూర్చి ఆదుకోవాలి. వీలైనంత దగ్గర ప్లాంట్లనుంచే ఆక్సిజన్‌ కేటాయింపులు జరపాలి.

ఆక్సిజన్‌ అవసరమైన వాళ్లే ఎక్కువ...!

రాష్ట్రంలో కరోనా మొదటిదశ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు గరిష్ఠంగా 270 టన్నుల ఆక్సిజన్‌ అవసరమైంది. అదే ఇప్పుడు రోజుకు 590 టన్నులు వినియోగించాల్సి వస్తోంది. ఈ నెలాఖరులోగా రోజువారీ డిమాండ్‌ వెయ్యి టన్నులకూ చేరొచ్చని ప్రభుత్వ అంచనా. సెకండ్‌వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో సుమారు 90 శాతం మందికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 22,129 ఆక్సిజన్‌ పడకలు ఉండగా వాటిలో మంగళవారంనాటికి 20,766 నిండిపోయాయి. ఐసీయూ పడకలు 6,135 ఉండగా 5,737, వెంటిలేటర్‌ బెడ్లు 2,561 ఉండగా వాటిలో 1,871 నిండిపోయాయి. వీరంతా ఆక్సిజన్‌ అవసరమైన వారే. రాష్ట్రానికి ఏప్రిల్‌18 నాటికి కేంద్రం చేసిన ఆక్సిజన్‌ కేటాయింపులు రోజుకు 360 టన్నులు. ప్రస్తుతం అవి రోజుకు 590 టన్నులకు చేరినా అవసరాలకు సరిపోవడం లేదు.

కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలి

రాష్ట్రంలోని విశాఖ ఉక్కుతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోని ప్లాంట్ల నుంచి ఏపీకి కేంద్రం ఆక్సిజన్‌ కేటాయింపులు చేసింది. అక్కడినుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ తరలించేందుకు 100 క్రయోజనిక్‌ ట్యాంకర్లు అవసరమని అంచనా. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 74 వాహనాలు మాత్రమే ఉన్నాయి. వీటిని పెంచాల్సి ఉంది. రాష్ట్రానికి 20 ట్యాంకర్లు ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి కోరారు. ట్యాంకర్ల కొరతతోపాటు దూరాభారం మరో సమస్యగా మారింది. ఐనాక్స్‌ శ్రీపెరంబదూరు, సెయింట్‌ గోబియన్‌-లిండే ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి 60 కి.మీ.ల దూరం ఉంది. ఒడిశాలోని అంగుల్‌ నుంచి 500 కి.మీ.లు, రూర్కెలా నుంచి 760 కి.మీ.లు, కళింగనగర్‌ నుంచి 360 కి.మీ.లు, బళ్లారినుంచి 30 కి.మీ.ల దూరం ఉంది. అంతదూరం నుంచి రోడ్డు మార్గంలో ఆక్సిజన్‌ తెచ్చుకోవడంలో జాప్యం జరుగుతోంది. అందుకే కొన్నిసార్లు రైళ్లు, విమానాల ద్వారానూ ఆక్సిజన్‌ తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు అధికంగా ఆక్సిజన్‌ సరఫరా కోటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంతోపాటు రాష్ట్రానికి కాస్త దగ్గరగా ఉన్న ప్రాంతాలనుంచి సరఫరా అయ్యేలా ప్రభుత్వం చూడాల్సి ఉంది. విశాఖ ఉక్కులో ఉత్పత్తయ్యే మొత్తం ఆక్సిజన్‌ను మన రాష్ట్రానికే కేటాయించడంవంటి చర్యలు చేపట్టాలి.

నిల్వ సామర్థ్యం 575 టన్నులే..!

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం 575 టన్నులే. సగటున రోజుకు 570-590 టన్నుల ఆక్సిజన్‌ వినియోగించాల్సి వస్తోంది. గరిష్ఠంగా 620 టన్నులు అవసరమైన సందర్భాలున్నాయి. ఆక్సిజన్‌ ట్యాంకరు రావడమే ఆలస్యం క్షణాల్లో ట్యాంకుల్లో నింపాల్సి వస్తోంది. ఇటీవల విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్‌ ట్యాంకరును తీసుకొస్తున్న డ్రైవర్‌.. ఇంకా 250 కి.మీ.ల దూరం ఉందనగా తీవ్ర అలసటతో జాతీయరహదారి పక్కనే ట్యాంకరును నిలిపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. జీపీఎస్‌ పనిచేయకపోవడంతో ట్యాంకరు ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. పోలీసులు జాతీయరహదారిని జల్లెడపట్టి ట్యాంకరును కనిపెట్టి తీసుకొచ్చారు. గుంటూరు జీజీహెచ్‌లో, విజయవాడలోనే మరో ప్రైవేటు ఆసుపత్రిలో మరికొన్ని గంటల్లో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకుంటాయనగా పోలీసులు గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటుచేసి ట్యాంకరును చేర్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ఏర్పాటుచేసిన పైప్‌లైన్లన్నీ కొవిడ్‌కు ముందు అవసరాలకు ఏర్పాటు చేసినవి. అప్పట్లో ఇతర వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన రోగుల్లో.. కొవిడ్‌ రోగులకు మాదిరి ఇంత ఎక్కువ పరిమాణంలో, ఎక్కువ ప్రెజర్‌తో ఆక్సిజన్‌ అవసరమైనవారు కొద్దిమందే ఉండేవారు. దానికి తగ్గట్టు ఏర్పాటుచేసిన పైప్‌లైన్లను కరోనా తొలి దశలో ప్రభుత్వం కొంత మెరుగుపరిచింది. కొత్త లైన్లు వేసింది. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల నిర్వహణపరమైన లోపాలుండటం, నైపుణ్యమున్న మానవవనరుల కొరత వంటి సమస్యలున్నాయి. దీనివల్ల ఆక్సిజన్‌ వృథా అవడం, రోగులందరికీ తగిన ప్రెజర్‌తో ఆక్సిజన్‌ అందకపోవడంవంటి సమస్యలు కొన్ని చోట్ల తలెత్తుతున్నాయి. వాటన్నింటినీ సరిదిద్దాల్సి ఉంది.

ఇదీ చదవండి:నాలుగున్నర గంటల ఆలస్యం...గాల్లో కలిసిన 11 ప్రాణాలు !

ABOUT THE AUTHOR

...view details