విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవం, జ్వాలాతోరణాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు చూడచక్కని రంగవల్లులు వేసి వాటిలో దీపాలు వెలిగించేందుకు పోటీపడ్డారు. పెనుగంచిప్రోలులో మున్నేరుకు.. నదీ హారతి ఇచ్చారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో.. 250 రకాల సుగంధ ద్రువ్యాలతో మహాశాంతి అభిషేకం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని భైరవకోన పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, బాలత్రిపుర సుందరిదేవి ఆలయాల్లో.. సహస్ర దీపోత్సవం, జోతిర్లింగార్చన చేశారు.
కార్తిక దీపాల వెలుగులతో కళకళలాడిన శివాలయాలు - state wide karthika depostva
రాష్ట్రవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయాలకు పోటెత్తిన భక్తులు... శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీపారాధనల వెలుగులతో ఆలయ ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో స్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులకు జ్వాలా తోరణం వైభవంగా జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీఅంజనేయస్వామి ఆలయంలో జ్వాలా తోరణం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. బనగానపల్లెలోని చౌడేశ్వరిదేవికి పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు. కర్నూలులో లక్ష దీపోత్సవ కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. కేసీ కాల్వలో నిర్వహించిన తుంగా హారతి విశేషంగా ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా మడకశిరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో శ్రీవారికి గరుడవాహన సేవ కన్నులపండువగా సాగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి... గరుత్మంతునిపై తిరువీధుల్లో విహరించారు.