గుండె..కాలేయం..కళ్లు..కిడ్నీలు.. ఇలా అవయవాల కోసం నిరీక్షిస్తున్న వారెందరో ఉన్నారు.. మేమున్నామంటూ ముందుకొచ్చి కొంతమంది దానం చేస్తుండగా.. ఆప్తులు మరణ అంచుల్లో ఉన్నప్పుడు అంతులేని దుఃఖంలోనూ కొందరు పరుల మేలు ఆలోచించి.. పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.. వారిలో తమవారిని చూసుకుంటున్నారు.
● మృత్యుంజయరెడ్డి
తాను చనిపోతూ.. నలుగురి ప్రాణం నిలిపి ధనంజయరెడ్డి(19) మృత్యుంజయరెడ్డి అయ్యారు. 2016 నవంబరు 10న అంగళ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెత్ అయిన ఈ యువకుడి గుండె, రెండు కిడ్నీలు, కాలేయాన్ని నలుగురికి అమర్చారు. తమ బిడ్డ చిరంజీవిగా ఉండాలని నిమ్మనపల్లె మండలం గుడ్రెడ్డిగారిపల్లెకు చెందిన ధనంజయ తల్లిదండ్రులు రామిరెడ్డి, శోభారాణి అందుకు అంగీకరించారు. స్విమ్స్‌లో వైద్యులు ఈ అవయాలు వేరు చేసి గుండె చెన్నైకి, కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించి బాధితులకు అమర్చారు. నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి ఒక కిడ్నీ తీసుకెళ్లి ఓ వ్యక్తికి... మరో దానిని స్విమ్స్ ఆస్పత్రిలో ఓ తితిదే ఉద్యోగికి అమర్చారు.
● నలుగురిలో మురళి
పాకాల మండలం కావలివారిపల్లెకు చెందిన మురళి(34) బ్రెయిన్‌డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానం చేశారు. ఇతని అవయవాలు నలుగురికి అమర్చడంతో చిరంజీవిగా ఉన్నారు. కుటుంబ సభ్యులు తమ బిడ్డ బతికే ఉన్నాడంటూ చెప్పుకొంటూ... జీవనం సాగిస్తున్నారు.
● మహిళ స్ఫూర్తి
ఐరాల మండలం చిగరపల్లెకు చెందిన ప్రవీణ్(33) బ్రెయిన్‌డెడ్ అయ్యారు. 2016 ఆగస్టు 12న ఆయన సతీమణి భవ్య అవయవ దానానికి చర్యలు తీసుకున్నారు. తద్వారా ఐదుగురికి ప్రాణదానం చేశారు. ఆమె ధైర్యానికి పలువురి నుంచి ప్రశంసలు లభించాయి.
కార్డు జేబులో పెట్టుకుంటా
అవయవ దానం చేస్తానని రాత పూర్వకంగా ప్రకటనతో పాటు జారీ అయిన ప్రత్యేక కార్డును నిరంతరం జేబులోనే ఉంచుకుంటున్నా. తద్వారా ఎప్పుడు ఏం జరిగినా తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి... సమయం వృథా కాకుండా ఉండటానికి దోహదపడుతుంది. - గిరీష్, నిర్వాహకులు, వెల్‌విషర్స్
వైద్య విద్యార్థుల కోసం...!
వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడేలా తన దేహాన్ని మరణానంతరం వినియోగించుకోవాలని అనంతపురం మెడికల్ కళాశాలకు దరఖాస్తు పెట్టుకున్నా. ఇందుకు వైద్య కళాశాల నుంచి అంగీకారం వచ్చింది. భావి వైద్యులకు ఉపయోగపడడం ద్వారా ప్రజానీకానికి వైద్య సేవలు మెరుగవుతాయని భావించా. - ఎం.ప్రభాకరరెడ్డి, విశ్రాంత ఆర్‌జేడీ, విద్యాశాఖ
ఆధునిక వైద్యంతో మరణించిన వ్యక్తి శరీరంలోని ప్రతి భాగం పనికొస్తుంది. భగవంతుడు మనకిచ్చిన అవయవాలను మరణించిన తర్వాత మట్టికే పరిమితం కాకుండా ప్రాణాపాయంలో ఉన్న మరొకరికి ఇచ్చే విధానం ద్వారా పునర్జన్మను పొందొచ్ఛు అవయవ మార్పిడి విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉంది. - డాక్టర్ జి.జగదీష్, విశ్రాంత సంచాలకులు, బర్డ్, తిరుపతి
ఇదీ చదవండి:'15కోట్ల మంది బాలలు, యువత చదువుకు దూరం'