Retirement: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొందరు ఉద్యోగులు పదవీవిరమణ ప్రయోజనాలు అందడం లేదు. వారు పదవీవిరమణ పొందారో.. లేక ఉద్యోగంలో ఉన్నారో వారికే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి దీన్ని అమలు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వెంటనే అమల్లోకి రాగా.. ఎయిడెడ్, గ్రంథాలయ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగులకు ఇంతవరకు అమలు చేయలేదు. దీనికి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వడం లేదు. దీంతో గత జనవరి నుంచి జూన్ వరకు 60ఏళ్లు పూర్తి చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ అనుమతి లేదని ఉన్నతాధికారులు జీతాలు ఇవ్వడం లేదు.
మరోపక్క పదవీవిరమణ వయసును 62ఏళ్లకు పెంచినందున ప్రయోజనాలు ఇచ్చేందుకూ నిరాకరిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్ని పర్యాయాలు వినతులు ఇచ్చినా దీనిపై స్పందన లేదని బాధితులు వాపోతున్నారు.
కొన్నిచోట్ల ఇంటికి.. మరికొన్ని చోట్ల విధులు..: పదవీ విరమణపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానందున ఎయిడెడ్, గ్రంథాలయ సంస్థల్లో కొన్నిచోట్ల 60ఏళ్లు నిండినవారిని ఇంటికి పంపించేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత రావాలంటూ ఉన్నతాధికారులు, యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఒక్క గ్రంథాలయ సంస్థలోనే ఏప్రిల్ నెలలో 15మంది, మే నెలలో మరో 20మంది వరకు పదవీవిరమణ పొందారు. వీరిని విధుల నుంచి రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చేశారు.
- ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రకాశం జిల్లాలో కొన్నిచోట్ల 60ఏళ్లు నిండినా కొనసాగిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా రిజిస్టర్ పెట్టి సంతకాలు పెట్టిస్తున్నారు. కానీ, జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎయిడెడ్‌లో జనవరి నుంచి ఇప్పటి వరకు వంద మందికిపైగా ఉపాధ్యాయులకు 60ఏళ్లు పూర్తయ్యాయి. ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చిన వారికి మాత్రం 62ఏళ్లు అమలు చేస్తున్నారు.
- సొసైటీలు, కార్పొరేషన్లలో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించి, పదవీవిరమణపై స్టే తెచ్చుకుంటున్నారు. వీరు విధుల్లో కొనసాగుతున్నా జీతాలు మాత్రం రావడం లేదు. వీటన్నింటికి ఉత్తర్వులు అమలు చేసినా ప్రభుత్వం జనవరి నుంచి జీతాల బకాయిలు ఇస్తుందా? లేదా? అనేదానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా విభాగాల్లో ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి 62 ఏళ్లు వర్తింపుపై స్పష్టత లేదు.