రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఎవరెవరికి అవకాశం దక్కనుందనే విషయంలో స్పష్టత వచ్చింది. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ఓడిన 24మందికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఎన్నికల తర్వాత ఈ 24మందిలో కొంతమందిని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తవారికి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అలా మార్చిన నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఓడిన వారికి ఇస్తారా లేక ఇప్పుడు పార్టీ సమన్వయకర్తలుగా ఉన్నవారికి అవకాశం ఇస్తారా అన్న విషయంలో మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం మీద 175 నియోజకవర్గాల్లోనూ వైకాపాకు చెందిన వారు ప్రొటోకాల్ పదవిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని నేతలు చెబుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో రాజకీయ సమీకరణల దృష్ట్యా టికెట్ పొందలేకపోయిన వారికీ ఇప్పుడు పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను ఇప్పుడు నియమించనున్నారు. ఈ జాబితాను ఆదివారం విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన అది కార్యరూపం దాల్చలేదు. కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించే వారి పేర్లను ఈ సారి అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.