ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: వేతన సవరణపై ఇవాళ కేసీఆర్ ప్రకటన..!

By

Published : Mar 22, 2021, 5:14 AM IST

తెలంగాణలో వేతనసవరణ సహా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోమారు సమావేశమైన సీఎం... పూర్తిస్థాయిలో చర్చించారు. 30 శాతానికి అటూఇటుగా పీఆర్సీ ప్రకటించవచ్చని సమాచారం.

తెలంగాణ: వేతన సవరణపై ఇవాళ కేసీఆర్ ప్రకటన..!
తెలంగాణ: వేతన సవరణపై ఇవాళ కేసీఆర్ ప్రకటన..!

తెలంగాణ: వేతన సవరణపై ఇవాళ కేసీఆర్ ప్రకటన..!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శాసనసభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన సీఆర్ బిస్వాల్ కమిటీ... 2020 డిసెంబర్ 31న నివేదిక ఇచ్చింది. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను కమిషన్ సిఫారసు చేసింది.

ఉద్యోగ సంఘాలతో చర్చలు...

కమిషన్ సిఫారసులపై సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. 7.5 శాతం ఫిట్​మెంట్ ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కనీసం 40 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా... ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొద్ది రోజుల క్రితం సీఎంను కలిసిన ఉద్యోగసంఘాల నేతలు... ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన మధ్యంతర భృతి కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చేందుకు కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

రూ. 8వేల కోట్లు...

ఉద్యోగులకు మంచి వేతనసవరణ ఇస్తామని, ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. బడ్జెట్‌లో వేతనసవరణ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించని ప్రభుత్వం... ఆర్థికశాఖ పద్దులో నిర్వహణా వ్యయం కింద రూ. 8,000 కోట్లు అదనంగా కేటాయించారు. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం... రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.

మరోమారు భేటీ...

తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మరోమారు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ నేతలు పాల్గొన్నారు. వేతన సవరణ సహా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. 33 శాతంతో వేతన సవరణ చేయాలని ఉద్యోగసంఘాలు కోరినట్లు సమాచారం.

ఇవాళ ప్రకటన!

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 30 శాతానికి అటూఇటుగా వేతనసవరణ, 61ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంపు సహా సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, ఈహెచ్ఎస్ పథకం అమలు, ఉపాధ్యాయుల పదోన్నతులు, ఇతర సమస్యలకు పరిష్కారాలతో ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:కొవిడ్ కేర్ సెంటర్లలో ఆకలి కేకలు.. పౌష్టికాహారం పక్కదారి

ABOUT THE AUTHOR

...view details