AMARAVATI MUNICIPALITY : రాజధాని ప్రాంతంలోని 22 గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనకు చుక్కెదురైంది. సోమవారం గ్రామసభలు జరిగిన మూడు గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 గ్రామ పంచాయతీలను విలీనం చేసి అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం గ్రామస్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారు. ఇందులో రాజధాని పరిధిలో ఉన్న లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామస్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలుపుతూ 12 అంశాలతో కూడిన అభ్యంతరాలను ఇచ్చారు. రాజధాని పరిధిలో లేని హరిశ్చంద్రపురం గ్రామస్థులు 4 అంశాలతో అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు. లింగాయపాలెంలో ప్రభుత్వ ప్రతిపాదనకు మాదల వెంకట శేషగిరిరావు సమ్మతి తెలియజేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను78మంది వ్యతిరేకిస్తూ చేతులెత్తారు. అనిల్ అనే రైతు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కంటే 29 గ్రామాల ప్రజలకు కారుణ్య మరణాలకు అనుమతినిచ్చి మీ నిర్ణయాలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో గ్రామసభకు హాజరైనవారంతా ఏకగ్రీవంగా ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలతోపాటు హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాలను కలిపి 32 గ్రామాలతో కూడిన మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనతోపాటు అభివృధ్ధికి స్పష్టమైన మార్గసూచితో వచ్చి గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభించిన రోజే గ్రామసభలు నిర్వహించి గందరగోళం సృష్టించడానికే ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని రైతులు ఆరోపించారు.
లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామస్థులు తెలిపిన కొన్ని అభ్యంతరాలు ఇలా..
* 2015లో 3 మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో భూ సమీకరణ ద్వారా భూములు తీసుకున్నారు. బృహత్తర ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కాగితాల మీద చూపారే తప్ప అభివృద్ధి చేయలేదు. అభివృధ్ధి చేయకుండా మున్సిపాలిటీగా మార్చడం అవగాహన లేని చర్య.
* ఆదాయం లేకుండా మున్సిపాలిటీ చేస్తే ఇక్కడి ప్రజలు కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
* మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి ఆపేసి ఆర్థిక విష వలయంలోకి నెట్టేశారు. ఈ తరుణంలో మున్సిపాలిటీ చేసి కొత్త పన్నులతో మా జీవితాలు చిన్నాభిన్నమవుతాయి.
* సీఆర్‌డీఏ చట్టం ద్వారా ఏడాది పొడవునా ఉపాధి హామీ పథకంలో పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ చేస్తే ఈ అవకాశాన్ని కోల్పోతాం.