భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా.. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ(Oommen Chandy), ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌లు.. పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఉమెన్ చాందీ తెలిపారు.
ధరల భారంపై జిల్లాల్లో సైకిల్ యాత్రలు
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని ఉమెన్ చాందీ(Oommen Chandy) స్పష్టం చేశారు. ఇతర సీనియర్ నేతలు మాత్రం పార్టీ సమావేశాలకు వస్తున్నారన్నారు. పెట్రో ధరల పెంపుపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించామని...పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు భారంగా మారాయన్నారు. ధరల భారంపై జిల్లాల్లో సైకిల్ యాత్రలు చేస్తామని...జులై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. కాంగ్రెస్ పునర్నిర్మాణం దిశగా ఇకపై కార్యక్రమాలు శ్రీకారం చుడతామన్నారు. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని....హోదా అంశంలో భాజపా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఛారిటీ మాత్రమే నడుస్తుందని....అభివృద్ధి పనులు అన్ని ఆగిపోయాయని విమర్శించారు.
ఇదీ చదవండి:BJP State Meet: రాష్ట్రంలో ప్రచార ఆర్భాటం ఎక్కువైంది: సోము