పశ్చిమ బంగాల్లో దీపావళి వేడుకలకు కేవలం గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే అనుమతినిస్తూ పశ్చిమ బంగా కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా 2 గంటల పాటు మాత్రమేనని స్పష్టం చేసింది. దీపావళి రోజున సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్లను అనుమతించనున్నట్లు తెలిపింది. 'ఛఠ్ పూజ' వేడుకల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో 35 నిమిషాల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
"మా ఆదేశాలను తప్పక అమలు చేయాలి. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు మా బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తాయి" అని పశ్చిమ బంగా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కల్యాణ్ రుద్ర తెలిపారు.