కరోనా ప్రపంచంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో మారిపోయాయి. చివరకు పెళ్లిళ్లు భిన్నంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. అలాంటి పెళ్లే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగింది. ఆస్ట్రేలియాలో వివాహబంధంతో ఒక్కటైన జంటను.. తల్లిదండ్రులు ఆన్‌లైన్(Virtual Marriage)లో వీక్షించి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆశీర్వదించారు. బంధువులందరినీ పిలిచి ఎప్పటికీ గుర్తిండి పోయేలా అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని భావించినా.. కొవిడ్, లాక్‌డౌన్ కారణంగా వారి ఆశలు నెరవేరలేదు. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్ సహా పెళ్లి, తల్లిదండ్రులు లేకుండానే జరిగిపోయాయి. కరోనా జడలు విప్పుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మార్గం లేదని అభిప్రాయపడుతున్నారు.
పాలమూరు వధూవరులు.. సిడ్నీలో వివాహం
మహహబూబ్ నగర్ భగీరథ కాలనీలో నివాసముండే విశ్రాంత తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి కుమారుడు వంశీధర్ రెడ్డి, ఉపాధ్యాయుడు మనోహర్ రెడ్డి కుమార్తె సాహితి ఆస్ట్రేలియా సిడ్నీలో నివాసముంటారు. వంశీధర్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, సాహితి అక్కడే పీజీ చదువుతోంది. ఏడాది క్రితమే ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పడ్డాయి. మాటల మధ్య పిల్లలిద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉండటంతో ముడిపెడితే బాగుంటుందని పెద్దలు నిశ్చయించారు.
ఆన్‌లైన్‌లో పరిణయం..
కరోనా, లాక్‌డౌన్‌తో పిల్లలు స్వదేశానికి రాలేని పరిస్థితి. ఆస్ట్రేలియాలోనే ఓ గుళ్లోనే పెళ్లి చూపులు... ఆ తర్వాత నిశ్చితార్థాన్ని అక్కడ నిర్వహించగా అంతర్జాలంలో తల్లిదండ్రులు, బంధువులు వీక్షించారు. కనీసం కల్యాణమైన ఘనంగా చేద్దామనుకుంటే సెకండ్ వేవ్ కొవిడ్ ఉద్ధృతితో అదీ సాధ్యపడలేదు. చివరకు సిడ్నీలోనే కొద్దిమంది సమక్షంలోనే సంప్రదాయ బద్దంగా వివాహ వేడుకను నిర్వహించారు.