తెలంగాణలో ఆన్‌లైన్ పాలన అమల్లోకి రాబోతోంది. ఎలక్ట్రానిక్ కార్యాలయం (ఈ-ఆఫీస్) సాఫ్ట్‌వేర్ ద్వారా రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో సులభతర పరిపాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమలు కానుంది. దీని నిర్వహణకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయడం సహా ఉద్యోగుల డిజిటల్ సంతకాలు సేకరించాలని వివిధ శాఖలకు ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది.
కరోనా క్రమంలో దస్త్రాల నిర్వహణ భౌతికంగా జరగడం ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
‘‘ఈ-కార్యాలయం ద్వారా కరోనా వ్యాప్తి భయం ఉండదు. దస్త్రాల నిర్వహణ సులభతరమవుతుంది. పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతాయి’" అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలుత రెవెన్యూ, విపత్తు నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, దేవాదాయ శాఖల్లో ఈ-ఆఫీస్ ప్రక్రియను ప్రవేశ పెట్టనున్నారు. ఈ-కార్యాలయాన్ని త్వరలోనే అన్ని శాఖల్లో అమలుచేసి, అధికారులు, సిబ్బంది ఇంట్లో ఉన్నా పనయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ ఏర్పాట్లు చేయాలి
ఈ-కార్యాలయం నిర్వహణకు ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని నియమించాలని ప్రభుత్వం తెలిపింది. మంగళవారంలోగా అవసరమైన సరంజామా సమకూర్చుకోవడంతోపాటు ఉద్యోగుల మస్తర్ డేటాబేస్, అధికారిక మ్యాపింగ్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను, ఈ ముద్ర అప్లికేషన్ ద్వారా వారి డిజిటల్ సంతకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని ఆయా శాఖలకు సూచించింది.
ఈ నెల 8లోపు దస్త్రాల డిజిటలైజేషన్, 9 లోపు ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేయనుంది. డిజిటల్ ప్రక్రియ ద్వారా పరిపాలన కొనసాగాలంటే ప్రతి సెక్షన్‌కు కనీసం ఒక స్కానర్ అవసరమవుతుంది. ఒకచోట స్కాన్ చేసి ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తే అది డిజిటల్ ఫైల్ రూపంలో ప్రతి సిస్టంలో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్ కోసం ప్రతి అధికారి దగ్గర 4 జీబీ ర్యామ్ అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న డెస్క్‌టాప్ సిస్టం అవసరమవుతుంది.