ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 10, 2019, 9:59 PM IST

ETV Bharat / city

నెల దాటినా తప్పని ఉల్లి కష్టాలు... దిగిరాని ధరలు

ఉల్లి ధరలు దిగిరానంటున్నాయి.అంతకంతకూ పెరుగుతున్నాయి. ధరల భారం భరించలేని సామాన్యులు... రాయితీ ఉల్లిపాయల కోసం రైతుబజార్లకు క్యూ కడుతున్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరి... గంటల తరబడి వేచిచూస్తున్నారు. కొందరికి కేజీ దొరుకుతున్నా... మరికొందరు అవి అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

onion-rates-in-ap
onion-rates-in-ap

నెల దాటినా ...దిగిరాని ఉల్లి ధరలు

నెల దాటినా ఉల్లి కష్టాలు తీరడం లేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు వంద రూపాయలకు పైగా అమ్ముతుండటంతో కొనాలంటేనే సామాన్యులు వామ్మో అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే రాయితీ గడ్డల కోసం ప్రజలు రైతుబజార్ల ఎదుట కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు లాంటి ప్రధాన నగరాలు సహా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. రాయితీ ఉల్లికోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో నిలబడుతున్నారు. చాలాచోట్ల ఒక్క కౌంటర్ మాత్రమే ఏర్పాటు చేస్తుండటం వల్ల... తమవంతు ఎప్పుడు వస్తుందా అని కొన్ని గంటలపాటు ఎదురుచూడాల్సి వస్తోందని జనం వాపోతున్నారు. తీరా వంతు వచ్చాక కూడా... ఒక కేజీ మాత్రమే ఇస్తున్నారని పెదవి విరుస్తున్నారు. క్యూలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఆ కేజీ ఉల్లిగడ్డలు కూడా దొరకడం లేదంటున్నారు. రద్దీ పెరిగిపోవడం వల్ల... కొన్నిచోట్ల పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మరీ నియంత్రిస్తున్నారు.

కేవలం రైతుబజార్లలోనే ఇచ్చి సరిపెట్టకుండా... రేషన్‌ దుకాణాల్లోనూ ఉల్లిపాయలు సరఫరా చేస్తే రద్దీ తగ్గుతుందని జనం అంటున్నారు. వీలైతే వాలంటీర్ల ద్వారా అందించగలిగితే మరింత బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా కుదరదంటే... రైతుబజార్లలో ఒక్కొక్కరికీ రెండు, మూడు కేజీలు అందిస్తే... మళ్లీ మళ్లీ తిరగాల్సిన బాధ తప్పుతుందన్నది జనం వాదన.

రాయితీ ఉల్లి కోసం గంటల తరబడి నిలబడటం వల్ల... కూలీనాలీ చేసుకునే తమకు ఉపాధి పోతోందని కొందరు ఆవేదన చెందుతున్నారు. మనిషికి కేజీ మాత్రమే అనడం వల్ల... పిల్లలను బడి మాన్పించి మరీ ఉల్లిపాయల క్యూలైన్లలో నిలబెడుతున్నామని మరికొందరు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఉల్లి కష్టాలు తీర్చాలని... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

రేపటి నుంచే ఆర్టీసీ ఛార్జీల పెంపు

ABOUT THE AUTHOR

...view details