హైదరాబాద్ ఎల్బీనగర్ పై వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాలానగర్ సమీపంలోని ఫతేనగర్‌కు చెందిన ఉదయ్‌రాజ్(18), డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న మేనమామ అన్న కుమార్తె అనూష(20)ను పరీక్షా కేంద్రానికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చాడు. పరీక్ష అనంతరం ఇద్దరు సంఘీ ఆలయానికి బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌పైకి చేరుకోగానే... వెనుకనుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
పరీక్ష రాసి.. గుడికి వెళ్తూ... అనంతలోకాలకు..
బంధువులమ్మాయిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు. పరీక్ష అయ్యాక ఇద్దరు కలిసి ఆలయానికి పయనమయ్యారు. కానీ... కారు రూపంలో వచ్చిన మృత్యువు అతని ప్రయాణం గుడికి చేరకుండానే ఆపేసింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పై వంతెనపై జరిగింది.
ఈ ఘటనలో ఉదయ్‌రాజ్ అమాంతం ఎగిరి కిందనున్న రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు స్పందించి హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనూష తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు.. మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఆ వాహనంపై వెళ్తున్న సైదాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని సాయిప్రియ(20), బానోత్ నగేశ్(17) తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఎల్బీనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు... ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.